
హత్యకు హత్య సమాధానం కాదు: చంద్రబాబు
పోలవరం: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్ సీపీ కన్వీనర్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. హత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని ఆయన అన్నారు. పోలవరం పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారమిక్కడ మాట్లాడుతూ.. హత్యకు హత్య సమాధానం కాదని అన్నారు. కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎస్పీలకు మధ్య సమన్వయం లేక పోవడమే కారణంగానే వివాదాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని తేల్చిచెప్పారు.
సకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇప్పటివరకు 16 సార్లు ప్రాజెక్టును స్వయంగా పరిశీలించానని తెలిపారు. స్పిల్ వే పని పూర్తి అవుతోందని, ప్రతివారం పోలవరం పనితీరుపై సమీక్ష చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ 12 గేట్లు పూర్తి చేశారని, మరో 32 గేట్లు పూర్తి చేయాల్సి వుందని తెలిపారు. కాంక్రీటు వర్కుకు మెషినరీ అవసరమని, అందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. వేసవి కావడంతో రాత్రి సమయాల్లో కూడా పని చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రంతో సమన్వయంతో వెళ్లాల్సిన అవసరముందన్నారు.