సాక్షి, కర్నూలు: గ్రామ స్థాయిలో ప్రతీ రైతన్నను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్నిరకాలుగా కృషి చేస్తోందని.. కానీ, చంద్రబాబు హయాంలో అలాంటి ఆలోచనల్లో ఒకటైనా ఏనాడైనా చేశాడా? అని నిలదీశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. కర్నూలు పత్తికొండ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..
చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే. కరువు పరిస్థితులు తప్ప మరేం లేవు. టీడీపీ పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారు. అసలు ఆయన పాలనలో ఈ-క్రాప్ అనే మాటే లేదు. సోషల్ అడిట్ అనేది లేదు. ఇప్పుడు రాష్ట్రంలో కరువు లేదు.. వలసలు లేవు. కరువు సీమగా పేరున్న రాయలసీమ ఇప్పుడు కళకళలాడుతోంది. రిజర్వాయర్లు కూడా నిండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు అవుతున్నాయి. గత ప్రభుత్వ పాలనకూ, మీ బిడ్డ పాలనకూ తేడా చూడండని ప్రజలను కోరారాయన.
► రైతుకు శత్రువు చంద్రబాబు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి ఆయన. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నాడు. నిండా అన్నదాతల్ని ముంచేశాడు. మేం మాత్రం రైతన్నకు అదనపు ఆదాయం రావాలనే లక్ష్యంతో పథకాలు తీసుకొచ్చాం. ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీ అమూల్‌ను తీసుకొచ్చాం. గతంలో హెరిటేజ్‌పేరుతో దోచుకున్నవారికి అడ్డుకట్ట వేశాం. అమూల్ ధర పెంచాక హెరిటేజ్ కూడా పెంచింది. దళారులు లేకుండా రైతులు పంటను అమ్ముకునే పరిస్థితి కల్పించాం.
► నమ్మిన రైతులు, పొదుపు సంఘాలు, యువత సహా అవ్వాతాతలను మోసం చేసి అప్పులపాలు జేశాడు చంద్రబాబు.
► గతంలో.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని చంద్రబాబు వెటకారం చేశారు. కానీ, మీ బిడ్డ కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వాళ్లే ఉన్నారు.
► రాజమండ్రిలో డ్రామా కంపెనీ మాదిరి ఓ షో జరిగింది. ఆ డ్రామాపేరు మహానాడు. చంపేసిన వ్యక్తిని కీర్తిస్తూ. అదే మనిషి ఫొటోకు దండలేశారు. తానే చంపి.. తానే పూలదండలు వేస్తున్నాడు. మహానాడు సాక్షిగా జరిగిన డ్రామా ఇది.
► చంద్రబాబుకు ఒరిజినాలిటీ లేదు. పర్సనాలిటీ లేదు. క్యారెక్టర్ లేదు. క్రెడిబిలిటీ అంతకన్నా లేదు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా టీడీపీకి లేరు. పొత్తుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు.. ఏ గడ్డైనా తింటారు. ఒక్కఛాన్స్ ఇస్తే ఏదో చేస్తా అంటున్నాడు. సీఎంగా మొదటి సంతకానికి ఒక క్రెడిబిలీటీ ఉంటుంది. కానీ, చంద్రబాబు మోసంగా మార్చేశారు. చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుతక్తులు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పుకునే ధైర్యం లేదు. చంద్రబాబు సత్యాన్ని పలకరు.. ధర్మానికి కట్టుబడరు. విలువలు, విశ్వసనీయత రెండూ లేవు. మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదు.
► బాబు బతుకే ఒక కాపీ పేస్ట్ బతుకు, మోసం. అన్ని పార్టీల మేనిఫెస్టోలను కాపీ కొట్టాడు. నా పాదయాత్రతో మేనిఫెస్టోను రూపొందించాం. ప్రజల కష్టాల నడుమ, పేదల గుండె చప్పుడు నుంచి మా మేనిఫెస్టో పుట్టింది. మన మట్టి నుంచి మేనిఫెస్టో పుట్టింది. కానీ, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కర్ణాటకలో పుట్టింది. మన పథకాలను కాపీ కొట్టేసి పులిహోర కలిపేశాడు. అసలు మేనిఫెస్టో ఎలా పుడుతుందో చంద్రబాబుకు తెలుసా? అంటూ ఎద్దేవా చేశారు సీఎం జగన్.
► కొత్త వాగ్దానాలతో, కొంగ జపాలతో చంద్రబాబు మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో ఒక యుద్ధం జరగబోతోంది. వీరి యుద్ధం జగన్‌తో కాదు.. పేదలతో. పేదవాడికి, పెత్తందారుడికి నడుమ యుద్ధం జరగబోతోంది. ఎల్లోమీడియా ప్రచారానికి.. ఇప్పుడు జరుగుతున్న మంచికీ యుద్ధం జరగబోతోంది. ధైర్యంగా, ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదు. అందుకే చంద్రబాబు తన గజదొంగల ముఠా వెంటేసుకుని రాష్ట్రాన్ని దోచుకోవడానికి మళ్లీ వస్తున్నారు. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5.. వీరికి తోడు దత్తపుత్రుడు.. వీరికి కావాల్సింది రాజకీయ పోరాటం కాదు.. అధికారం కోసం ఆరాటం. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే చంద్రబాబు ముఠా పని. చంద్రబాబు డీపీటీ(దోచుకో.. పంచుకో.. తినుకో) కావాలా? మన డీబీటీ(నేరుగా బటన్ నొక్కి సంక్షేమం అందించడం) కావాలా?..
► మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీబిడ్డకు సైనికుల్లాగా నిలబడండి. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడి దయ, మీ చల్లని దీవెనలు మాత్రమే. అవి ఎప్పుడూ ఉండాలనుకుంటున్నాడు. నా నమ్మకం మీరేనని గర్వంగా చెబుతున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు.
ఇదీ చదవండి: రైతులకిచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తున్నాం
Comments
Please login to add a commentAdd a comment