
క్రికెటర్ విజయ్‌ని స్మిత్ దారుణంగా తిట్టాడా?
ప్రస్తుతం కొనసాగుతున్న బోర్డర్-గవస్కర్ ట్రోఫీలో వివాదాలకు అడ్డే లేకుండా పోయింది. ప్రపంచంలో మేటి జట్లుగా పేరొందిన భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ అంటే సహజంగానే మైదానంలో హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్టే ప్రస్తుత సిరీస్‌లో ఇరుజట్లు ధాటిగా తలపడుతున్నప్పటికీ.. ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న వివాదాలు మాత్రం ఇరు జట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్లెడ్జింగ్‌కు తోడు ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ 'డీఆర్‌ఎస్ వివాదం' సిరీస్‌ను కుదిపేసింది.
డీఆర్‌ఎస్ రివ్యూ కోసం స్మిత్ డ్రెసింగ్ రూమ్ సలహాలు తీసుకోవడం పెద్ద దుమారమే రేపింది. ఇక రాంచీ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భుజానికి గాయమవ్వగా.. ఆసిస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోహ్లిని వెక్కిరించేలా అనుకరించడం వివాదం రేపింది. తాజాగా ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్మిత్.. విజయ్‌ను దారుణంగా దుర్భాషలాడటం వివాదం రేపుతోంది.
సిరీస్ ఎవరిదో తేల్చే నాలుగు టెస్టు మూడో రోజు సోమవారం.. జోష్ హజెల్‌వుడ్ బ్యాటుకు తగిలి వచ్చిన బంతిని స్లిప్‌లో ఉన్న మురళీ విజయ్ క్యాచ్ పట్టాడు. భారత ఆటగాళ్లు కాన్ఫిడెంట్‌గా అప్పీల్ చేశారు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోయిన ఎంపైర్లు.. థర్డ్ ఎంపైర్‌కు నివేదించారు. థర్డ్ ఎంపైర్ మాత్రం బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా నిర్ణయాన్ని వెలువరించాడు. హజెల్‌వుడ్ ఔటైతే తాను బ్యాటింగ్‌కు దిగాల్సి ఉండటంతో అందుకు సిద్ధమవుతూ కనిపించిన స్మిత్.. థర్డ్ ఎంపైర్ నిర్ణయం నేపథ్యంలో ఆగ్రహంగా స్పందిస్తూ.. విజయ్‌ను ఉద్దేశించి (ఫ.. చీట్) అంటూ దారుణంగా నోరుపారేసుకున్నాడు. డ్రెసింగ్ రూమ్‌లో అతని ఆగ్రహం, దుర్భాషలాడటం కెమెరా కంటికి చిక్కింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. స్మిత్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి హజెల్‌వుడ్ నాటౌట్ నిర్ణయం పెద్దగా మ్యాచ్‌పై ప్రభావం చూపలేదు. అశ్విన్ బౌలింగ్‌లో ఆ తర్వాత బంతికే హజెల్‌వుడ్ ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 137 పరుగులకే చాపచుట్టేయడంతో 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయం దిశగా దూసుకుపోతున్నది.
In response to @BenHorne8 tweet. This is the video. pic.twitter.com/TiiClKS1BH
— Neroli Meadows (@Neroli_M_FOX) March 27, 2017