హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాలకు రాజకీయ పార్టీలు కొత్త కమిటీలను ఏర్పాటు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంధిగ్ధం నుంచి బయట పడటానికి ఆయా పార్టీలు చర్చలు చేపట్టాయి. కొత్త జిల్లాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా కమిటీలన్నింటినీ పునర్వ్యవస్థీకరించక తప్పడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు జిల్లా కమిటీలపై కసరత్తు చేపట్టాయి. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.
మరోవైపు, కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయంగా ఆయా పార్టీల నేతలకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. జిల్లా పార్టీ కమిటీల్లో ప్రతి నాయకుడికి ఏదో ఒక పదవి దక్కే అవకాశాలున్నాయి. జిల్లాల పరిధి చిన్నగా ఉండటంతో జిల్లా కమిటీల్లో ఏదో ఒక పదవి దక్కుతుందని నేతలు ఎవరికి వారు అంచనాల్లో ఉన్నారు. కొందరు చిన్నస్థాయి నాయకులు కూడా రాష్ట్ర పార్టీ నేతలను కలిసి ఈ విషయాలపై ఆరా తీస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. జిల్లా కమిటీలను పునర్వ్యవస్థీకరించడానికి కొన్ని పార్టీలు ఇప్పటికే చర్యలు ప్రారంభించగా, మరికొన్ని పార్టీలు ఆ దిశగా ఇంకా ఆలోచనలు కూడా చేయడం లేదు.
ఇప్పటివరకు ఒక పెద్ద జిల్లాకు పార్టీ నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన నేతలకు మాత్రం తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. ఇప్పుడు తన పరిధి తగ్గడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న జిల్లాకు ప్రాతినిథ్యం వహించడం ఇష్టంలేని నాయకులు రాష్ట్ర కమిటీల్లో చోటు కావాలని కోరుతున్నారు. ఇకపోతే, ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేతను ఎప్పటిలాగే అలాగే కొనసాగించి కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కొత్త వారిని నియమించాలన్న ఆలోచనకు కొన్ని పార్టీలు వచ్చాయి. అయితే, అందులోనూ పార్టీలకు చిక్కులు తప్పడం లేదు. జిల్లా కమిటీ నాయకులు విభజనలో వారు ప్రాతినిథ్యం వహించే ప్రాంతం వేరే జిల్లాకు వెళ్లిపోవడం, ఆ ప్రాంతంలో ఆ నేతలు అంతగా పట్టులేకపోవడం రాష్ట్ర నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తోంది.
అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మొత్తం జిల్లా కమిటీలను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని జిల్లా కమిటీలకు కొత్త వారిని అధ్యక్షులుగా నియమిస్తారని అంటున్నారు. ఇకపోతే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా అన్ని జిల్లాల డీసీసీలను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నప్పటికీ ప్రస్తుత డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలన్న భావనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే వారు ప్రాతినిథ్యం వహించే ప్రాంతం ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా బాధ్యతలను అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. పీసీసీ సమావేశం నిర్వహించి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.
కొత్త జిల్లాలకు అనుగుణంగా పార్టీ కొత్త కమిటీలను నియమించే విషయంలో సీపీఎం మిగతా పార్టీలకన్నా ముందుంది. ఆ పార్టీ నల్గొండ జిల్లా కమిటీలను ఇప్పటికే విభజించింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు కొత్త కార్యదర్శులను జాబితాను సీపీఎం ప్రకటించింది.
కొత్త జిల్లాలు.. పార్టీలకు కొత్త తలనొప్పులు
Published Wed, Oct 12 2016 6:54 PM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
Advertisement