
అమన్ రిసార్ట్స్ విక్రయం: డీఎల్‌ఎఫ్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగానికి చెందిన విలాసవంత హోటళ్ల చైన్ ‘అమన్ రిసార్ట్స్’ను రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ విక్రయించింది. అమన్ రిసార్ట్స్‌ను తొలిసారిగా ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రమోటర్ అడ్రియన్ జెకాకే వీటిని అమ్మివేసినట్లు డీఎల్‌ఎఫ్ పేర్కొంది. డీల్ విలువను రూ. 35.8 కోట్ల డాలర్లు(రూ. 2,200 కోట్లు)గా ప్రకటించింది. ప్రధాన వ్యాపారాలకు సంబంధంలేని బిజినెస్‌లను విక్రయించడం ద్వారా సమీకరించే నిధులను రుణ భారాన్ని తగ్గించుకునేందుకు డీఎల్‌ఎఫ్ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
నిజానికి 2012 డిసెంబర్‌లో 30 కోట్ల డాలర్లకు అమన్ రిసార్ట్స్‌ను విక్రయించేందుకు జెకాతో డీఎల్‌ఎఫ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే 2013 జూన్‌లోగా డీల్ పూర్తికాకపోవడంతో ఒప్పందం రద్దయ్యింది. ఆపై మరోసారి అమన్ అమ్మకం కోసం జెకాతోపాటు వివిధ సంస్థలతో డీఎల్‌ఎఫ్ చర్చలు నిర్వహిస్తూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 25 హోటళ్లను కలిగిన అమన్ రిసార్ట్స్... చివరికి జెకా చేతికే చిక్కింది. కాగా, ఢిల్లీలోని లోధీ హోటల్‌ను డీల్ నుంచి మినహాయించినట్లు డీఎల్‌ఎఫ్ పేర్కొంది.