అదిగో.. ఆగస్టు మేఘం!
* ఇప్పుడే కరువు భయం వద్దు.. ఇంకో నెల చూద్దాం
* వ్యవసాయశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్
* క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరమని వ్యాఖ్య
* ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధం కావాలని సూచన
* సాగు సంక్షోభంలో కూరుకుపోతోందంటూ ఆవేదన
* ఆధునీకరణ, యాంత్రీకరణను ప్రోత్సహించాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, వర్షాల్లేక పంటలు ఎండిపోతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈనెలలో వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయని... లేకపోతే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌పీ సింగ్, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ ప్రియదర్శిని, వ్యవసాయ వర్సిటీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రావు, పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నెలాఖరు వరకు వర్షాలు కురిస్తే పంటలకు ఢోకా లేదని.. అప్పటికీ వర్షాలు రాకుంటే కరువు పరిస్థితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అయితే ఇప్పుడే కరువు గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని, క్షేత్రస్థాయిలో మరింత ఆందోళన వ్యక్తమవుతుందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం.
వ్యవసాయం కుంటుపడింది..
రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోతోందని, అనుకున్న రీతిగా అభివృద్ధి చెందడం లేదని సమీక్షలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయశాఖలో విస్తరణ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని.. వ్యవసాయ వర్సిటీలలో పరిశోధనలు తగ్గిపోవడం మంచి పరిణామం కాదని చెప్పారు. పరిశోధనలు పెరగాలని.. అవసరమైన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తేవాలని, వ్యవసాయ వర్సిటీ ఇందులో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. కాగా వ్యవసాయ విస్తరణాధికారులను కూడా మండల స్థాయిలో నియమించుకోవాలని.. ఎన్ని ఉద్యోగాలు అవసరమో ప్రతిపాదిస్తే, త్వరలో నియామకాలు జరుపుతామని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అవసరమైన మేరకు ఆగ్రానమిస్టులను కూడా నియమించుకోవాలని చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, ఆధునీకరణ పెరగాలని... రాష్ట్రంలోని వ్యవసాయ క్షేత్రాలను క్రాప్ కాలనీలుగా గుర్తించి విభజించాలని, విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలని ఆదేశించారు. రైతులకు మేలు చేయడంతోపాటు రాష్ట్రం ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించే విధంగా సరైన ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు.
రెండు పంటల కాలం రానుంది...
రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని... వీటిద్వారా రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు అందుబాటులోకి వస్తుందని కేసీఆర్ చెప్పారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ తమ కార్యక్రమాలను విస్తరించుకోవాలని సూచించారు. తెలంగాణలో రెండు పంటలు పండే కాలం వస్తుంద న్నారు. సంప్రదాయ వ్యవసాయమే కాకుండా మార్కెట్ అవసరాలకు తగిన విధంగా వ్యవసాయ పద్దతుల్లో మార్పులు రావాలని, పట్టణాల పరిసర వ్యవసాయ భూముల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని చెప్పారు.
పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర కోసం అవసరమైన మార్కెటింగ్ వ్యూహాన్ని అవలంబించాలని సూచించారు. కాగా వ్యవసాయ వర్సిటీకి సెర్చ్ కమిటీ నియమించి వీసీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. వర్సిటీలో పరిశోధనలు పెరగాలని... వర్సిటీ పరిధిలోని భూముల్లోనే కాకుండా ప్రొఫెసర్లు, విద్యార్థులు అన్ని జిల్లాల్లో పర్యటించి పరిశోధనలు చేయాలని చెప్పారు. తెలంగాణవ్యాప్తంగా భూసార పరీక్షలు చేయిస్తామని, దానికి అనుగుణంగా ఎక్కడ ఏ పంటలు వేయాలో రైతులకు సూచించాలని పేర్కొన్నారు.