బేర్ మార్కెట్ స్వరూపం బయటపడింది
Published Sat, Aug 17 2013 3:18 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
‘‘2008లో బేర్ మార్కెట్ ప్రారంభమైంది. ఇది ప్రస్తుతం తన పూర్తి వాస్తవిక రూపాన్ని సంతరించుకుంది’’ అని మార్కెట్ల తాజా పతనంపై ఫస్ట్ గ్లోబల్ ట్రేడింగ్ వ్యూహకర్త శంకర్ శర్మ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మామూలుగా జరిగే మార్కెట్ల నష్టానికీ శుక్రవారం జరిగిన మార్కెట్ల పతనం భిన్నమైందని ఆయన పేర్కొంటూ, ఇది కచ్చితంగా బేర్ మార్కెట్టేనన్న విషయం ఈ పతనంతో స్పష్టమైందని శంకర్‌శర్మ అన్నారు. ‘మార్కెట్లు పూర్తి కనిష్ట స్థాయికి పడినట్లేనా...!’అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబు తూ, ‘మార్కెట్లు పడినప్పుడే మనం ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి. మార్కెట్లు రెండు శాతం ర్యాలీ చేసినప్పుడు అక్కడ లాభాల స్వీకరణ గురించి మనం ఎందుకు మాట్లాడుకోకూడదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది పెట్టుబడులను ఎలా రక్షించుకోవాలన్న అంశంపైనే కానీ, కనిష్ట స్థాయికి మార్కెట్లు పడ్డం-ఆ స్థాయిలో చౌక రేటు వద్ద లభించే షేర్ల కొనుగోలు గురించో మరే ఇతర అంశం గురించో కాదు’’ అని అన్నారు. ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో బుల్ మార్కెట్ల సృష్టి అసాధ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నిఫ్టీ 5,000 పాయింట్ల స్థాయికి...
మార్కెట్ల నష్టకాలం పూర్తికాలేదని ఆయన సూచిస్తూ... సమీప భవిష్యత్తులో నిఫ్టీ 5,000 పాయింట్ల స్థాయికి చేరుతుందని కూడా అంచనావేశారు. భారత్ పలు కఠిన స్థూల ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతం కూడా నమోదవడం కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్య్రాంకింగ్ స్టాక్స్‌కు ఇంకా ఇబ్బందులు పొంచి ఉన్నాయని పేర్కొంటూ, తాను ఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టబోనని వివరించారు.
క్రూడ్ రంగం కూడా బేరిష్‌లోనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ స్టాక్స్ పటిష్టంగానే ఉన్నాయని వివరిస్తూ, నారాయణ మూర్తి నేతృత్వంలో ఇన్ఫోసిస్ ఉత్తమ ఫలితాలను నమోదుచేసుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా మార్కెట్ల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఈ మార్కెట్లు కొంత పతనం కావచ్చుకానీ, వర్ధమాన దేశాల స్థాయిలో ఈ పతనం రేటు ఉండకపోవచ్చన్నారు. సహాయక ప్యాకేజీల ఉపసంహరణలపై కూడా ఇది ఆధారపడి ఉంటుందని వివరించారు.
Advertisement