Shankar Sharma
-
మార్కెట్లో స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీ మొదలైంది: శంకర్ శర్మ
ఈక్విటీ మార్కెట్లో స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీ మొదలైందని మార్కెట్ విశ్లేషకుడు శంకర్ శర్మ అభిప్రాయపడ్డారు. మరికొంత కాలం పాటు ఈ స్మాల్‌క్యాప్ షేర్ల హావా కొనసాగుతుందని శర్మ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను స్మాల్‌క్యాప్ షేర్ల కొనుగోళ్లకే మొగ్గు చూపుతానని శర్మ తెలిపారు. తన పోర్ట్‌ఫోలియో మొత్తంలో 67శాతం స్మాల్‌క్యాప్స్, మిడ్ క్యాప్స్ రంగానికి చెందిన షేర్లు ఉన్నాయని తెలిపారు. భారత్‌తో సహా అనేక దేశాల స్టాక్ మార్కెట్లో ఇప్పటికే స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీ ప్రారంభమైందని, గడచిన 4-5 ట్రేడింగ్ సెషన్లలో లార్జ్‌క్యాప్స్ షేర్ల ర్యాలీని అధిగమించాయని శర్మ తెలిపారు. ఇలాంటి సంఘటన చూసి చాలా ఏళ్లైందని శర్మ చెప్పారు. ‘‘2017లో స్మాల్‌క్యాప్స్ షేర్లు గొప్ప ర్యాలీని చేశాయి. తరువాత 2018, 2019ల్లో అదే ప్రదర్శన కొనసాగింది. 2007 గరిష్టాల నుంచి ఈ షేర్లు దాదాపు 55-60 శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇప్పుడు తిరిగి ర్యాలీని ప్రారంభించాయి. కేవలం భారత్‌లోనే కాక మొత్తం ప్రపంచ మార్కెట్లలో స్మాల్‌క్యాప్ షేర్ల గణనీయమైన ర్యాలీని చూస్తున్నాము.’’ అని శర్మ తెలిపారు. స్మాల్‌క్యాప్ షేర్లలో అత్యధిక అస్థిరత ఉంటుంది. తొందరపడి గుడ్డిగా కొనడం అత్యంత ప్రమాదం. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమని శర్మ ఈ సందర్భంగా తెలిపారు. వాస్తవానికి భారత్ ఈక్విటీ మార్కెట్ ఇతర ప్రపంచ మార్కెట్ల ర్యాలీతో పోలిస్తే చాలా తక్కువగా ఉందన్నారు. బ్రెజిల్ మార్చి కనిష్ట స్థాయి నుండి 50 శాతం పెరిగిన సంగతి ఈ సందర్భరంగా ఆయన గుర్తు చేశారు. స్టాక్స్ ర్యాలీ ఎల్లప్పుడూ నిజమైన ఆర్థిక వ్యవస్థతో చేతులు కలపవలసిన అవసరం లేదు. చౌకైన డబ్బుతో ఈక్విటీలు ఆకర్షణీయంగా మారినప్పుడు, ఆర్థిక వృద్ధికి తోడ్పడే ఫండమెంటల్స్ లేకుండానే స్టాక్స్ మార్కెట్లు పెద్ద ర్యాలీని చేస్తాయి. ఈ సూత్రం అర్థిక అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మార్కెట్లతో పాటు అన్ని మార్కెట్లకు కూడా వర్తిస్తుందని శర్మ తెలిపారు. బీఎస్ఈ గణాంకాలను పరిశీలిస్తే వారంలో రోజుల్లో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4శాతం లాభపడింది. ఇదే ఇండెక్స్ గడచిన నెలరోజుల్లో 12శాతం ర్యాలీ చేసింది. -
బేర్ మార్కెట్ స్వరూపం బయటపడింది
‘‘2008లో బేర్ మార్కెట్ ప్రారంభమైంది. ఇది ప్రస్తుతం తన పూర్తి వాస్తవిక రూపాన్ని సంతరించుకుంది’’ అని మార్కెట్ల తాజా పతనంపై ఫస్ట్ గ్లోబల్ ట్రేడింగ్ వ్యూహకర్త శంకర్ శర్మ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మామూలుగా జరిగే మార్కెట్ల నష్టానికీ శుక్రవారం జరిగిన మార్కెట్ల పతనం భిన్నమైందని ఆయన పేర్కొంటూ, ఇది కచ్చితంగా బేర్ మార్కెట్టేనన్న విషయం ఈ పతనంతో స్పష్టమైందని శంకర్‌శర్మ అన్నారు. ‘మార్కెట్లు పూర్తి కనిష్ట స్థాయికి పడినట్లేనా...!’అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబు తూ, ‘మార్కెట్లు పడినప్పుడే మనం ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి. మార్కెట్లు రెండు శాతం ర్యాలీ చేసినప్పుడు అక్కడ లాభాల స్వీకరణ గురించి మనం ఎందుకు మాట్లాడుకోకూడదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది పెట్టుబడులను ఎలా రక్షించుకోవాలన్న అంశంపైనే కానీ, కనిష్ట స్థాయికి మార్కెట్లు పడ్డం-ఆ స్థాయిలో చౌక రేటు వద్ద లభించే షేర్ల కొనుగోలు గురించో మరే ఇతర అంశం గురించో కాదు’’ అని అన్నారు. ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో బుల్ మార్కెట్ల సృష్టి అసాధ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిఫ్టీ 5,000 పాయింట్ల స్థాయికి... మార్కెట్ల నష్టకాలం పూర్తికాలేదని ఆయన సూచిస్తూ... సమీప భవిష్యత్తులో నిఫ్టీ 5,000 పాయింట్ల స్థాయికి చేరుతుందని కూడా అంచనావేశారు. భారత్ పలు కఠిన స్థూల ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతం కూడా నమోదవడం కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్య్రాంకింగ్ స్టాక్స్‌కు ఇంకా ఇబ్బందులు పొంచి ఉన్నాయని పేర్కొంటూ, తాను ఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టబోనని వివరించారు. క్రూడ్ రంగం కూడా బేరిష్‌లోనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ స్టాక్స్ పటిష్టంగానే ఉన్నాయని వివరిస్తూ, నారాయణ మూర్తి నేతృత్వంలో ఇన్ఫోసిస్ ఉత్తమ ఫలితాలను నమోదుచేసుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా మార్కెట్ల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఈ మార్కెట్లు కొంత పతనం కావచ్చుకానీ, వర్ధమాన దేశాల స్థాయిలో ఈ పతనం రేటు ఉండకపోవచ్చన్నారు. సహాయక ప్యాకేజీల ఉపసంహరణలపై కూడా ఇది ఆధారపడి ఉంటుందని వివరించారు.