
ఎస్ బీఐ చార్జీల మోత
న్యూఢిల్లీ: తమ ఖాతాదారులకు షాక్ ఇచ్చేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్ బీఐ) సిద్ధమైంది. పెనాల్టీ, ఇతర చార్జీల పేరుతో ఖాతాదారులపై ఎడాపెడా భారం మోపనుంది. కనీస నిల్వ లేని ఖాతాదారులకు పెనాల్టీ విధించనుంది. ఐదేళ్ల విరామం తర్వాత ఈ నిబంధనలను మళ్లీ తెస్తోంది. ఇక నుంచి నెలలో మూడుసార్లు మాత్రమే ఉచితంగా నగదు డిపాజిట్ చేయగలరు. నాలుగో డిపాజిట్ నుంచి రూ. 50 సేవా పన్ను, సర్వీస్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లపై మూడు నెలలకు రూ.15 ఛార్జీ వసూలు చేస్తుంది. కొత్తగా అమల్లోకి తెచ్చిన వడ్డింపులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్ బీఐ ప్రకటించింది. కొత్త ఖాతాదారులను ఆకర్షించేందుకు కనీస నిల్వ నిబంధనను 2012లో ఎస్ బీఐ ఎత్తేసింది. మళ్లీ ఇప్పుడు పునరుద్ధరించింది.
- మెట్రోపాలిటన్ శాఖల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ (రూ.5000) కంటే 75 శాతం కన్నా తక్కువ ఉంటే సేవా పన్నుతో పాటు రూ.100 జరిమానా
- మినిమమ్ బ్యాలెన్స్ కన్నా అకౌంట్ లో 50 శాతం తక్కువ మొత్తం ఉంటే సర్వీస్ ఛార్జితో కలిపి రూ.50 జరిమానా చెల్లించాలి
- ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ మూడు సార్లు దాటితే రూ.20 ఛార్జి
- ఎస్‌బీఐ ఏటీఎంలలో నగదు ఉపసంహరణ ఐదు సార్లు దాటితో రూ.10 చొప్పును ఛార్జి
- బ్యాంకు ఖాతాలో రూ.25 వేల కన్నా ఎక్కువ మొత్తం ఉంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా సొంత ఏటీఎంల నుంచి ఎన్ని సార్లైనా నగదు ఉపసంహరించుకోవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసినప్పుడు ఛార్జి పడకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఖాతాలో ఉండాలి.
- 1000 రూపాయల వరకు యూపీఐ, యూఎస్‌ఎస్‌డీ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు