పదేళ్లలో 90 వేల మెగావాట్ల సామర్థ్యం
ఎన్‌టీపీసీ లక్ష్యం ఇది కంపెనీ సీఎండీ అరూప్ రాయ్ చౌదరి
న్యూఢిల్లీ: వచ్చే పదేళ్లలో రెట్టింపు విద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించనున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీ సీఎండీ అరూప్ రాయ్ చౌదరి చెప్పారు. ప్రస్తుతం 44,398 మెగావాట్ల(మె.వా) విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా దీన్ని 90,000 మె.వా.కు పెంచుకోగలమని తెలిపారు. ప్రస్తుతం 23,000 మె.వా. ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, వచ్చే అయిదేళ్లలో ఇవి పూర్తి కాగలవని చెప్పారు. మరో 15,000 మె.వా. ఏడేళ్లలో, ఇంకో 8,000 మె.వా. ప్రాజెక్టులు పదేళ్లలో అందుబాటులోకి రాగలవని చౌదరి తెలిపారు.
ప్రస్తుతం విద్యుదుత్పత్తి కోసం ఎక్కువగా బొగ్గుపై ఆధారపడుతున్న ఎన్‌టీపీసీ.. భవిష్యత్‌లో సౌర విద్యుత్‌పై మరింతగా దృష్టి పెట్టాలని యోచిస్తోంది. ఈ ప్లాంట్ల నిర్వహణ చాలా సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ సోలార్ పవర్ ప్రాజెక్టులను చేపట్టాలని భావిస్తున్నట్లు చౌదరి తెలిపారు. సౌర విద్యుత్‌కి సంబంధించి జాతీయ, ప్రాంతీయ గ్రిడ్‌ల అనుసంధానం, స్థల లభ్యత మొదలైనవి ప్రధానమైన సమస్యలని ఆయన పేర్కొన్నారు. పైగా ఇతర సంప్రదాయ వనరులతో పోలిస్తే సౌర విద్యుత్‌పై రాబడి కూడా తక్కువేనన్నారు. అయితే, దేశీయంగా అతి పెద్ద విద్యుదుత్పత్తి సంస్థ అయినందున ఎన్‌టీపీసీ ఎంతో కొంత సౌర విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని చౌదరి తెలిపారు. దీనికి అనుగుణంగానే 1,000 మె.వా. సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గతేడాదే ఎన్‌టీపీసీ ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు, నిల్చిపోయిన ప్రభుత్వ, ప్రైవేట్ పవర్ ప్రాజెక్టుల్లో కొన్నింటిని కొనుగోలు చేయాలని ఎన్‌టీపీసీ యోచిస్తోన్నట్లు చౌదరి తెలిపారు. జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాజెక్టులను గుర్తించామని, వాటి కొనుగోలు సాధ్యాసాధ్యాలపై మదింపు జరుగుతోందని చౌదరి పేర్కొన్నారు.