వెలుగులో ఐటీ, ఫార్మా షేర్లు
ప్రపంచ మార్కెట్ల బలహీనత కారణంగా కొత్త సంవత్సరం వరుసగా మూడోరోజూ స్టాక్ సూచీలు క్షీణించాయి. గత రాత్రి అమెరికా, శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లు తగ్గడంతో గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ 20,731 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది.
ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో ముగింపులో చాలావరకూ నష్టాల్ని పూడ్చుకుని, చివరకు 37 పాయింట్ల స్వల్పనష్టంతో 20,851 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గత మూడురోజుల్లో సెన్సెక్స్ 320 పాయింట్ల వరకూ నష్టపోయింది. మరో 10 రోజుల్లో టెక్నాలజీ కంపెనీల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ప్రధాన ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్ 2 శాతంపైగా ర్యాలీ జరిపాయి. ఇదేబాటలో ఫార్మా షేర్లు ర్యాన్‌బాక్సీ, లుపిన్‌లు 3-4 శాతం మధ్య పెరిగాయి. పవర్, ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు చెందిన షేర్లు క్షీణించాయి. టాటా పవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీ, లార్సన్ అండ్ టూబ్రోలు 2-4 శాతం మధ్య క్షీణించాయి. ఆయిల్ షేర్లు ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్‌లు 1-3 శాతం మధ్య పడిపోయాయి.
మిడ్‌క్యాప్ జోరు : ఒక రోజు విరామం తర్వాత తిరిగి మిడ్‌క్యాప్ షేర్లు బాగా పుంజుకున్నాయి. డెరివేటివ్ విభాగంలో ట్రేడయ్యే అశోక్ లేలాండ్, హెక్సావేర్, బయోకాన్, అరబిందో ఫార్మా, ఫ్యూచర్ రిటైల్, సెంచురీ టెక్స్‌టైల్స్, యునెటైడ్ స్పిరిట్స్, జేపీ పవర్, టాటా కమ్యూనికేషన్ షేర్లు 3-7% మధ్య ర్యాలీ జరిపాయి. నగదు విభాగంలో ట్రేడయ్యే ఎంసీఎక్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేర్లు 17-20 శాతం మధ్య ఎగిసాయి. ఎంసీఎక్స్‌లో ప్రమోటర్లు తాజా పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనను ప్రకటించడంతో ఈ షేర్లు పెరిగాయి. సొనాటా సాఫ్ట్‌వేర్, ఎంబీఎల్ ఇన్‌ఫ్రా, జస్ట్ డయిల్, టీసీఐ షేర్లు 10-15 శాతం మధ్య పరుగులు తీసాయి. చాలా రోజుల తర్వాత విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు స్వల్పంగా నికర విక్రయాలు జరిపారు. వీరు రూ. 18 కోట్లు వెనక్కు తీసుకోగా, దేశీయ సంస్థలు రూ. 280 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు.