
- తుపాకులతో పట్టపగలే బ్యాంకు దోపిడీకి యత్నం
సాక్షి, టన్నెర్స్‌విల్లే(అమెరికా): ప్రకృతి అందాలకు నెలవైన పెన్సిల్వేనియాలోని పొకోనోలో ఇద్దరు మహిళలు బీభత్సం సృష్టించారు. స్థానిక టన్నెర్స్‌విల్లేలోని సిటిజన్ బ్యాంకులో పట్టపగలే దోపిడీ యత్నించారు.
క్రైస్తవ సన్యాసిని(నన్)ల దుస్తులు ధరించిన ఇద్దరు మహిళలు సోమవారం మధ్యాహ్నం కస్టమర్ల మాదిరి బ్యాంకులోకి ప్రవేశించారు. కొద్ది సేపటికే దుస్తుల్లో దాచిపెట్టుకున్న తుపాకులను బయటికి తీసి సిబ్బందికి గురిపెట్టి కరెన్సీ కట్టలను తీసుకునే ప్రయత్నం చేశారు. బిక్కుబిక్కుమంటూ నిల్చున్న ఉద్యోగుల్లో ఒకరు కాస్త ధైర్యం చేసి ప్రమాదఘంటిక(ఆలారం బెల్)ను మోగించాడు.

స్పీకర్ల నుంచి ఒక్కసారే ‘కుయ్.. కుయ్..’ మంటూ సైరన్ శబ్ధాలు పెద్దగా మోగడంతో ఆ మహిళా దొంగలు బిత్తరపోయారు. వెంటనే తేరుకుని అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటికిగానీ బ్యాంకుకు చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలో దొంగల ముఖాలను గుర్తించారు. ఆ ఫొటోలోని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.