'ఆయనకు శిక్ష.. బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ కుట్ర'
ముంబై: తన భర్తకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించడంపై ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా భార్య వసంత కుమారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్జిషీటులో ఉన్న నిందితులందరికీ శిక్ష విధించడం మహారాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని వెల్లడించారు. ఇదంతా బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ కుట్ర అని ఆరోపించారు.
'ఆర్ ఎస్ ఎస్ అజెండాను నిసిగ్గుగా బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందులో భాగంగా సాయిబాబా లాంటి వారిని అణచివేస్తోంది. అప్రజాస్వామిక విధానాలు, ప్రజా సమస్యలపై గళమెత్తిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతోంద'ని ఫస్ట్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసంత కుమారి చెప్పారు. ప్రాసిక్యూషన్ ఎటువంటి ఆధారాలు చూపకపోయినా కోర్టు శిక్ష విధించడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెషన్స్ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
సాయిబాబాతో పాటు కేశవదత్త మిశ్రా(జేఎన్ యూ విద్యార్థి), మహేష్ కరిమాన్ తిక్రి, పాండు పొరా నరోటీ(గడ్చిరోలి రైతులు)లకు కోర్టు జీవితఖైదు విధించగా.. విజయ్ నాన్ తిక్రి(ఛత్తీస్ గఢ్ కు చెందిన గిరిజన కార్మికుడు)కి పదేళ్ల కఠిన కారాగార శిక్ష వేసింది.