ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ సందర్భంగా సోమవారం వెబ్ ఆప్షన్లకు అవకాశముంటుందని ఎదురుచూసిన అభ్యర్ధులకు నిరాశ ఎదురైంది.
హైదరాబాద్ సీటీ: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ సందర్భంగా సోమవారం వెబ్ ఆప్షన్లకు అవకాశముంటుందని ఎదురుచూసిన అభ్యర్ధులకు నిరాశ ఎదురైంది. వెబ్ ఆప్షన్లకు సంబంధించి లాగిన్ ఆప్షన్‌ను అధికారులు ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్లో ఓపెన్ చేయకపోవడంతో అభ్యర్ధులు తొలిరోజు ఆప్షన్లు నమోదు చేయలేకపోయారు. సోమవారం రాత్రి లాగిన్‌కు అవకాశమిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నా వెబ్‌సైట్లో అదేమీ కనిపించలేదు. ఇలా ఉండగా ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఇటీవలే వెలువడినందున ఆ విద్యార్ధుల ధ్రువపత్రాలను సోమవారం పరిశీలించామని, అందువల్లనే వెబ్‌కౌన్సెలింగ్‌కు తొలిరోజు అవకాశం కల్పించడంలో కొంత ఇబ్బంది అయ్యిందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
తొలిరోజు ఇటీవల సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించినట్లు కౌన్సెలింగ్ అధికారులు వివరించారు. సోమవారం 5వేలమంది ధ్రువపత్రాల పరిశీలన చేపట్టామన్నారు. 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నామని, 16వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తామని కౌన్సెలింగ్ చీఫ్ క్యాంప్ ఆఫసర్ (ఓఎస్డీ) రఘునాథ్ తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో పాలిసెట్, ఈసెట్ ైఫైనల్ కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. పాలిసెట్, ఈసెట్ అభ్యర్ధులు ఈరెండు రోజుల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చన్నారు. 18న రంజాన్, 19న ఆదివారం సెలవు రోజులైనందున 20 న పాలిసెట్, 21న ఈసెట్ సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు.