ఎంసెట్ ఫార్మశీ కౌన్సెలింగ్ ప్రారంభం
Published Tue, Sep 17 2013 2:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : ఫార్మశీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో ప్రారంభమైంది. తొలిరోజు 33 వేలలోపు ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా 58 మంది హాజరయ్యారు. వీసీ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి ధ్రువీకరణ వెరిఫికేషన్ పత్రాన్ని ర్యాంకర్‌కు అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ వెరిఫికేషన్ అధికారులు ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, డాక్టర్ కె.స్వప్నవాహిని, బోధకులు వి.మల్లికార్జునరావు, హనుమంతు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగనుంది.
ఎన్‌ఎస్‌ఎస్ సేవలు విస్తరించాలి
జాతీయ సేవాపథకం సేవలను విస్తరించాలని వీసీ లజపతిరాయ్ పిలుపునిచ్చారు. జిల్లాలో జాతీయ సేవా పథకం అమలుపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని కళాశాలల్లో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో సేవాదృక్పథం, నాయకత్వ లక్షణాల వృద్ధికి కృషి చేయాలన్నారు. సమాజం పట్ల అవగాహన, సేవా దృక్పథం ఉన్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. ఇంకుడు గుంతల ఏర్పాటు, పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. సమీక్షలో స్టేట్ లైజన్ అధికారి పి.రామచంద్రరావు, రీజియన్ అధికారి ఆర్.గోపాలకృష్ణ, ఆంధ్రా యూనివర్సిటీ అధికారి ప్రొఫెసర్ పాల్, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ గంజి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.
సిలబస్‌కు ఎనలేని ప్రాధాన్యం
విద్యార్థి జీవితానికి ఉపయోగ పడేదే నిజమైన విద్య అని, ప్రతి కోర్సు రూపకల్పనలో సిలబస్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉందని వీసీ లజపతిరాయ్ చెప్పారు. సోమవారం నిర్వహించిన ఎడ్యుకేషన్, గణితం, తెలుగు విభాగాల బోర్డాఫ్ స్టడీస్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఉపాధి అవకాశాలకు అనువైన సిలబస్‌తోనే అన్ని విభాగాలు బలోపేతమవుతాయని వివరించారు. విద్యార్థి భవిష్యత్తు తాను చదివే కోర్సుపై ఆధారపడి ఉంటుందన్నారు. అందుకే డిగ్రీ, పీజీ స్థాయిల్లో సిలబస్ కమిటీలు వేశామన్నారు. కామన్ కోర్ సిలబస్, యూజీసీ నిబంధనలకు లోబడి పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తామని చెప్పారు. ప్రిన్సిపాల్ మిర్యాల చంద్రయ్య, బోర్డాఫ్ స్టడీస్ చైర్మన్‌లు, సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement