స్పీకర్ కోడెల వీడియోను మాకు ఇవ్వండి
- ఎన్టీవీకి ఈసీ ఆదేశం
హైదరాబాద్: ఎన్నికల్లో ఖర్చు విషయమై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైఎస్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు చేసిన ఫిర్యాదు విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో దృశ్యాలను తమకు సమర్పించాలని ఎన్టీవీ చానెల్‌ను ఆదేశించింది. గత నెల 19వ తేదీన ఎన్టీవీ చానెల్ ముఖాముఖి కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. 1983 ఎన్నికల్లో తాను రూ. 30వేలు ఖర్చు చేస్తే.. 2014 ఎన్నికలకు వచ్చేసరికి రూ. 11.50 కోట్లు తాను వ్యయం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నట్టు ప్రసారమైంది.
దీంతో ఈసీ నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా ఖర్చుచేసి ఎన్నికల్లో తాను గెలిచినట్టు స్పీకర్ కోడెల పేర్కొన్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అంబటి ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ గత నెల 19వ తేదీన జరిగి.. 20న ప్రసారమైన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖాముఖి కార్యక్రమం పూర్తి వీడియో దృశ్యాలను తమకు సమర్పించాలని కోరుతూ ఈసీ ఎన్టీవీకి నోటీసులు జారీచేసింది.