ముంబై: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మైనర్లను (బాల, బాలికలను) వినియోగిస్తే... వాటి గుర్తింపును రద్దు చేస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయలేమని, పార్టీల గుర్తులను స్తంభింప జేయడం ద్వారా వాటికిచ్చిన గుర్తింపును వెనక్కి తీసుకునే అధికారం తమకు ఉన్నట్లు బాంబే హైకోర్టుకు మంగళవారం సమర్పించిన అఫిడవిట్‌లో ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రచారం లేదా ఎన్నికలకు సంబంధించిన పనుల్లో మైనర్లను వినియోగించడం నిషేధమని, దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఈసీ 2013 మే, 2014 సెప్టెంబర్‌లో రాజకీయ పార్టీలకు లేఖలు రాసినట్లు న్యాయవాది రాజగోపాల్ కోర్టుకు తెలిపారు.
అయితే, స్వతంత్ర అభ్యర్థులు మైనర్లను వినియోగిస్తే వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. దీనిపై తదుపరి విచారణ సమయంలో అఫిడవిట్ దాఖలు చేస్తామని న్యాయవాది చెప్పారు. దీంతో ఎన్నికల సమయంలో మైనర్లను వినియోగించడంపై నిషేధం కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణను కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది.