న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్ కేసుల దర్యాప్తు సందర్భంగా అధికారులు నిందితులను భయపెట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. నిందితులకు జారీ చేస్తున్న సమన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) తమ అధికారులను ఆదేశించింది. సమన్ల జారీకి సంబంధించి.. సీరియల్ నెంబర్ ప్రొటోకాల్‌తో పాటు సమన్ల జారీకి సహేతుక కారణాలను కూడా ఒక పుస్తకంలో నమోదు చేయాలని స్పష్టం చేసింది.
అలాగే, వాంగ్మూలం తీసుకునేందుకు పిలుస్తున్నారా? లేక సంబంధిత పత్రాలు కోరేందుకు పిలుస్తున్నారా? అనే విషయాన్ని దర్యాప్తు అధికారి సమన్లపై స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించింది. అవసరమైన పత్రాల వివరాలను, అవి తమ ప్రతినిధుల ద్వారా అందించే సౌకర్యం నిందితులకు ఉందా? లేదా? అనే అంశాలను కూడా పొందుపర్చాలని పేర్కొంది. విచారణకు ఎవరిని పిలుస్తున్నామో.. సంబంధిత కేసుతో వారికున్న సంబంధాన్ని కేసు ఫైలుపై పేర్కొనాలని స్పష్టం చేసింది.