పెద్దనోట్ల రద్దుపై బడ్జెట్‌లో జైట్లీ కామెంట్!
న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్టుగానే కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో పెద్దనోట్ల రద్దు గురించి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ‘ఏ రైట్ కాజ్ నెవర్ ఫెయిల్స్’ (ఒక మంచి పని ఎప్పుడూ విఫలం కాదు) అంటూ జాతిపిత మహాత్మాగాంధీ సూక్తిని ఉటంకించిన ఆయన.. పెద్దనోట్ల రద్దు అనేది సాహసోపేతమైన చర్య అని, దీనివల్ల జీడీపీ (స్థూలజాతీయోత్పత్తి) పెరగడమే కాకుండా స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు (డిమానేటైజేషన్) ప్రభావం రానున్న ఆర్థిక సంవత్సరంపై ఉండబోదని భావిస్తున్నట్టు చెప్పారు. రీమానేటైజేషన్ (కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చే) ప్రక్రియ ఇప్పటికే వేగం అందుకున్నదని, త్వరలోనే సంతృప్తికర స్థాయికి ఇది చేరుకుంటుందని ఆయన చెప్పారు.
గత ఏడాది నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే. రూ. వెయ్యి, రూ. 500 నోట్లు రద్దు చేయడంతో ప్రజలు పాతనగదును మార్చుకోవడానికి బ్యాంకుల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త కరెన్సీ అందుబాటులోకి రావడంతో బ్యాంకులు నగదు ఉపసంహరణపై ఆంక్షలు ఎత్తివేయడంతో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు, సామాన్యులకు కేంద్ర బడ్జెట్‌లో మరిన్ని ఉపశమన చర్యలు ప్రకటిస్తారని అందరూ ఆశిస్తున్నారు.