నోటు పోటు..మరో మరణం..
లక్నో: దేశ ప్రజలను కరెన్సీ కష్టాలు ఇంకా వీడడం లేదు. ఆర్థిక శాఖ, ఆర్బీఐ ఎన్ని ఉపశమన చర్యల్ని ప్రకటించినా.. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇంకా నమోదవుతునే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో బల్లియాలో మూడు గంటలపాటు క్యూలో నిలబడ్డంతో ఇంద్రసాని దేవి(70) చనిపోయారని పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
గురువారం సెంట్రల్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ వద్ద నగదు విత్ డ్రా కోసం వేచి వున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు. గుండెపోటు రావడంతో మరణించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆమె అంత్యక్రియల నిమిత్తం కూడా డబ్బులు లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులో అదే బ్యాంక్ ఏటీఎం దగ్గర నిలబడటం మరో విషాదం. ఈ సంఘటనపై విచారణ అనంతరం బాధ్యులపై చర్య తీసుకుంటామని జిల్లా ఎస్పీ వైభవ్ కృష్ట తెలిపారు.
కాగా నల్లధనాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో దేశ ప్రజల్లో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. దీంతో నగదుకోసం బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో గంటలర తరబడి క్యూలైన్లలో వేచి వున్న వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.