నల్లధనంపై ఈసీ ఉక్కుపాదం
ఎన్నికల్లో అక్రమ నగదు, మద్యం పంపిణీపై ఈసీ దృష్టి
వాటిని అరికట్టే దిశగా చర్యలు
గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటుకు రాష్ట్రాల సీఈవోలకు ఆదేశాలు
ఇంటింటికీ తిరిగి ఓటర్లను చైతన్యం చేయనున్న బృందాలు
అక్రమాలపై పోలింగ్ పర్యవేక్షణ కేంద్రాలకు వీటి ద్వారా సమాచారం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ నాయకులు విచ్చలవిడిగా వెదజల్లే నల్లధనం, అక్రమ మద్యాలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నడుం బిగించింది. ఇందులో భాగంగా ఓటర్లతో ‘చర్చ’ చేపట్టి వారిని చైతన్యం చేయాలని నిర్ణయించింది. మాజీ బ్యాంకర్లు, ప్రభుత్వ మాజీ అధికారులు, జర్నలిస్టులందరినీ దీనికి ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఎన్నికల్లో డబ్బు వెదజల్లడానికి అవకాశముందని భావిస్తున్న నియోజకవర్గాలు, మున్సిపల్ ప్రాంతాల్లో ‘గ్రామస్థాయి అవగాహన బృందాలు(వీఏజీలు), వార్డు స్థాయి అవగాహన బృందాల(డబ్ల్యూఏజీలు)ను వీరితో ఏర్పాటు చేయాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాల వివరాలివీ..
ఓటర్లతో ‘చర్చ’ కార్యక్రమం చేపట్టే ఈ బృందాల్లో రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు, బ్యాంకు అధికారులు, కార్పొరేట్లు, ప్రముఖ జర్నలిస్టులు, విద్యావేత్తలు, ఆయా ప్రాంతాల పౌర సమాజ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
తమ ప్రాంతాల్లోని ఓటర్లతో వీరు చర్చలు, సంప్రదింపులు జరుపుతారు. ఎన్నికల్లో అక్రమ నగదు ప్రవాహాన్ని, మద్యం పంపిణీని ప్రోత్సహించొద్దంటూ దీనిపై అవగాహన కల్పిస్తారు.
అక్రమ మద్యం, నగదు పంపిణీ జరుగుతుంటే తెలుసుకుని ఈ బృందాల సభ్యులు ఎన్నికల అధికారులకు తెలియజేస్తారు. అవసరమైనప్పుడు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తారు.
‘బాగా డబ్బు ఖర్చు’ అవుతుందని భావించే నియోజకవర్గాల జాబితాను ఎన్నికల సంఘం.. గత సంఘటనల ఆధారంగా రూపొందిస్తోంది. ఆయా ప్రాంతాల్లో విద్య, నగదు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసే అవకాశం... ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ జాబితా తయారు చేస్తోంది.
ఒక్కో బృందంలో 5-10 మంది సభ్యులు ఉంటారు. వీరిలో కనీసం ఒకరు లేదా ఇద్దరు మహిళలుంటారు. ఎక్కడ తప్పు జరిగినా.. పర్యవేక్షణ కేంద్రానికి(దీన్ని ఈసీ ఏర్పాటు చేస్తుంది) నివేదించడం తప్ప ఈ బృందం నేరుగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు.
నిజాయితీగల ఓటింగ్‌కు సంబంధించి రూపొందించిన ప్రచార సామగ్రిని ఈ వీఏజీలు, డబ్ల్యూఏజీలకు అందించాల్సిందిగా ఈసీ.. సీఈవోలను కోరింది.
ఈ వీఏజీలు, డబ్ల్యూఏజీల్లోని సభ్యులు ఏదైనా అక్రమంపై ఫిర్యాదు చేసినప్పుడు వారి భద్రతకు ముప్పు తలెత్తకుండా ఉండేందుకు వారు ఎవరనేది బయటకు తెలియకుండా సీఈవోలు జాగ్రత్త వహించాలని కూడా ఈసీ ఆదేశించింది.
అలాగే ఈ బృందాల్లోని సభ్యుల కాంటాక్టు నంబర్లు, వివరాలను.. ఆ ప్రాంతంలో మోహరించే ఎన్నికల పరిశీలకులందరికీ ఇవ్వాలి.
ఈ బృంద సభ్యుల భద్రత దృష్ట్యా వారి వివరాలను ఆయా ప్రాంతాల్లోని మేజిస్ట్రేట్లు, సీనియర్ పోలీసు అధికారులకు కూడా అందుబాటులో ఉంచాలి.
ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులతో రక్త సంబంధం, కుటుంబ బంధుత్వం లేనివారికి, రాజకీయ సంబంధాలు లేని వారికి మాత్రమే ఈ గ్రూపుల్లో అవకాశం కల్పిస్తారు.
పార్టీల ఆడిటర్లతో ఈసీ భేటీ
అక్రమ నగదు పంపిణీని అడ్డుకునే యత్నాల్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీల ఆడిటర్లతో సోమవారం సమావేశం కావాలని ఈసీ నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికల్లో అయిన ఖర్చునకు సంబంధించి వారు ఎలా ఆర్థిక నివేదికలు సమర్పించాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. కాగా ఎన్నికల నేపథ్యంలో సక్రమమైన నగదు రవాణాకు ఎలాంటి పరిమితీ లేదని ఎన్నికల వర్గాలు తెలిపాయి. అయితే తమకు అనుమానం వచ్చిన ఎలాంటి రవాణానైనా తనిఖీ చేసి నిలిపేసే అధికారం ఈసీ నిఘా స్క్వాడ్‌లకు ఉందని పేర్కొన్నాయి. అక్రమం కాని నగదు ఎంతైనా ఎక్కడికైనా రవాణా చేసుకోవచ్చని వెల్లడించాయి.