విమానం క్రాష్ ల్యాండ్.. తప్పిన పెనుముప్పు!
► తిరువనంతపురం-దుబాయ్ విమానానికి తప్పిన ముప్పు
► అత్యవసర ల్యాండింగ్.. దట్టంగా అలుముకున్న పొగలు
► 300 మందిని క్షేమంగా బయటకు పంపిన సహాయక సిబ్బంది
► ప్రయాణికుల్లో 226 మంది భారతీయులే
► కాసేపటికే పేలిన విమానం..
► అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు మృతి..
► గేర్లు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణం!
దుబాయ్: అది ఈకే 521 ఎమిరేట్స్ విమానం.. 282 మంది ప్రయాణికులు.. 18 మంది సిబ్బందితో తిరువనంతపురం నుంచి దుబాయ్ బయల్దేరింది.. ఎయిర్‌పోర్టు వచ్చేసింది.. రన్‌వేపై క్రాష్ ల్యాండ్ అయింది.. ఇంతలో ఒక్కసారిగా దట్టమైన పొగలు.. ప్రయాణికుల గుండెలు జారిపోయాయి.. ఇక అంతే అనుకున్నారు.. కానీ విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన స్పందించారు.. విమానాన్ని చుట్టుముట్టి నిమిషాల వ్యవధిలో అందరినీ దింపేశారు.. వారంతా అలా దిగారో లేదో విమానం భగ్గున మండుతూ పేలిపోయింది.. కొద్ది క్షణాలు ఆలస్యమైనా ఘోర ప్రమాదం జరిగిపోయేది..! ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నా వారిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ హఠాత్పరిణామంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు.
గేర్లు ఫెయిల్ అయ్యాయా?
కేరళలోని తిరువనంతపురం నుంచి ఎమిరేట్స్‌కు చెందిన విమానం (బోయింగ్ 777-300) బుధవారం ఉదయం 10.19 గంటలకు దుబాయ్‌కి బయల్దేరింది. మధ్యాహ్నం 12.50 గంటలకు దుబాయ్‌లో దిగాల్సి ఉంది. ఇందులో ప్రయాణిస్తున్న 282 మంది ప్రయాణికుల్లో ఏడుగురు చిన్న పిల్లలు సహా 74 మంది విదేశీయులు ఉన్నారు. విదేశీయుల్లో బ్రిటన్‌కు చెందినవారు 24 మంది, యూఏఈకు చెందినవారు 11 మంది, అమెరికా, సౌదీ అరేబియాకు చెందినవారు ఆరుగురు చొప్పున ఉన్నారు. మిగతావారిలో ఎక్కువ మంది కేరళకు చెందినవారున్నారు. అసలు ప్రమాదానికి కారణం ఏంటన్నది అధికారికంగా వెల్లడించలేదు. అయితే విమానం దిగే సమయంలో గేర్లు పనిచేయకుండా పోయాయని, ఫలితంగా విమానం రన్‌వేపై జారుకుంటూ పోయిందని, కాసేపటికే పేలిందని స్థానిక మీడియా వెల్లడించింది.
ప్రమాదంతో విమానాశ్రయం నిండా దట్టమైన పొగ అలుముకుంది. ఎయిర్‌పోర్టులోని అత్యవసర బృందాలు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి సహాయక చర్యలకు దిగారు. హుటాహుటిన ప్రయాణికులను కిందకు దింపేశారు. ప్రమాదం నుంచి ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారని విమానాశ్రయ వర్గాలు ప్రకటించాయి. అయితే పొగ కారణంగా కొందరు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. వారిలో 10 మందికి చికిత్స అందించి పంపించారు. పొగ ప్రభావానికి ఎక్కువగా గురి కావడంతో ఒక వ్యక్తిని మాత్రం హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానం ఎమిరేట్స్ సంస్థలో 13 ఏళ్ల నుంచి సర్వీసులు అందిస్తోంది. ప్రమాదం నేపథ్యంలో దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి మొత్తం 21 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇందులో రెండు విమానాలు భారత్‌కు రావాల్సినవి కూడా ఉన్నాయి. మరికొన్ని విమానాలను దారి మళ్లించారు.
ఒక నిమిషం ఆలస్యమైతే..
‘‘విమాన ప్రయాణికుల్లో ఎక్కువమంది కేరళవారే. విమానం బయల్దేరిన సమయంలో ఎలాంటి సమస్యా లేదు. సాంకేతిక సమస్య ఉందంటూ ఎలాంటి ప్రకటన చేయలేదు. విమానం ల్యాండ్ అయ్యాక కొద్దిగా ముందుకు కదిలి నేలను ఢీకొంది. విమానంలో పొగ రావడంతో ఏదో అయిందని అర్థమైంది. ఇంకో నిమిషం విమానంలో ఉండుంటే భారీ ప్రమాదం జరిగేది..’’ అని సాయి భాస్కర్ అనే ప్రయాణికుడు వెల్లడించారు. అత్యవసర ద్వారాల నుంచి దూకిన కొందరు ప్రయాణికులు గాయపడ్డారని ఆయన చెప్పారు. తనతో పాటు భార్యా పిల్లలు కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని షాజీ అనే మరో ప్రయాణికుడు చెప్పాడు.