ప్రాణాలు పోతున్నా.. ల్యాప్‌టాప్‌ల కోసం ఆగారు!
ఒకవైపు విమానం క్రాష్ ల్యాండింగ్ అవుతోంది. ఏ క్షణంలోనైనా ఎంతటి ప్రమాదం అయినా జరగొచ్చని, వెంటనే బయటకు వెళ్లిపోవాలని విమాన సిబ్బంది చెబుతున్నారు. అయినా చాలామంది ప్రయాణికులు పైన కేబిన్లలో ఉన్న తమ బ్యాగుల గురించి కాసేపు ఆగిపోయారట. ముఖ్యంగా కొంతమంది అయితే ల్యాప్‌టాప్.. ల్యాప్‌టాప్ అని అరవడం కూడా ఈ ఘటనపై తాజాగా బయటకు వచ్చిన వీడియోలో వినిపించింది. దుబాయ్ విమానాశ్రయంలో కొచ్చి నుంచి వెళ్లిన ఎమిరేట్స్ విమానం క్రాష్ ల్యాండ్ కావడం, అందులోని ప్రయాణికులు అంతా త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటం తెలిసిందే.
ప్రయాణికులు బయటకు రావడానికి ముందు తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం అవుతోంది. ఆ వీడియోలో... ఎమర్జెన్సీ చూట్లు ఉపయోగించి బయటకు వెళ్లిపోవాలని సిబ్బంది గట్టిగా చెప్పడం వినిపించింది. కాసేపటికి విమానం ముక్కలుగా విడిపోవడం, మంటలు రావడం కూడా వీడియోలో ఉంది. విమానంలో మొత్తం 300 మందికి పైగా ఉండగా, చాలామంది కేరళీయులే. పారాచూట్ తీసుకుని స్లైడ్ మీదుగా దూకాలని విమానంలోని మహిళా అటెండెంటు గట్టిగా అరిచి మరీ చెప్పింది. అయినా కూడా ప్రయాణికుల్లో కొంతమంది మాత్రం ప్రాణాలు కాపాడుకోవడం కంటే తమ విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లడానికే ప్రాధాన్యం ఇచ్చారు.