భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రమూక హతం
జమ్మూకశ్మీర్‌లో చొరబడేందుకు మరోసారి ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. దీంతో కుల్గాం జిల్లాలోని యారిపుర-ఫ్రిజల్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుడు కూడా ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందండంతో భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. యారిపుర-ఫ్రిజల్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆపరేషన్ ప్రారంభించాయి. మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా గాయపడ్డారని, వారు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కాల్పులు కొనసాగుతున్నాయని భద్రతా దళాలు తెలిపాయి.