ఆన్ లైన్ ప్రేమ.. పాకిస్తాన్ వెళ్లి..
ప్రేమ కోసం పాకిస్తాన్ వెళ్లిన ఓ భారత యువకుడు అక్కడ జైల్లో బంధి అయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు కొడుకును ఎలాగైనా తమకు అప్పగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని వేడుకుంటున్నారు. మోదీ చొరవ తీసుకుని పుత్రభిక్ష పెట్టి తమను పున్నామ నరకం నుంచి కాపాడాలని ముంబైకు చెందిన ఫౌజియా అన్సారీ, నెహాల్ అన్సారీలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. 2012లో ఆఫ్గానిస్తాన్ వెళ్లిన హమీద్ అన్సారీ(31) అక్కడి నుంచి అక్రమంగా పాకిస్తాన్ లోకి ప్రవేశించాడు.
ఆ తర్వాత సైన్యానికి చిక్కడంతో పాకిస్తాన్ సైనిక కోర్టు అతనికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 2012 నవంబరు 10వ తేదీన తమ కుమారుడు చివరగా మాట్లాడినట్లు తల్లిదండ్రులు చెప్పారు. ఓ పాకిస్తాన్ అమ్మాయిని ఆన్ లైన్ లో ప్రేమించానని చెప్పినట్లు తెలిపారు. మూడేళ్ల శిక్షకాలం పూర్తయిన తర్వాత ఈ ఏడాది నవంబరు 12న ముంబై వస్తున్నానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా హమీద్ ఇంటికి రాకపోవడంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు లేఖ రాసిన స్పందన లేదని చెప్పారు. ఇక ప్రధానమంత్రి మోదీయే తమ కుమారుడిని తిరిగి రప్పించగలరని అందుకే ఆయనకు వినతి పత్రం అందజేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.