అత్యాశకు వెళితే విడాకులే!
ముంబై: వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ సహా పలు పార్టీలతో కలసి కూటమి కట్టిన శివసేనకు సరికొత్త తలనొప్పులు మొదలైయ్యాయి. ‘మహాయుతి’ గా ఏర్పడ్డ శివసేన కూటమికి భాగస్వాముల నుంచి సీట్ల ఒత్తిడి కాస్తా తలనొప్పిగా మారింది. బీజేపీ ఎక్కువ స్థానాలను డిమాండ్ చేస్తున్ననేపథ్యంలో కోర్కెలు ఎక్కువైతే విడాకులకు దారి తీస్తుందని భాగస్వామ్య పార్టీలను హెచ్చరించింది.
ఎక్కువ సీట్ల కోసం పట్టుబట్టకుండా నిగ్రహం పాటించాలంటూ పార్టీ పత్రిక సామ్నాకు రాసిన సంపాదకీయంలో పేర్కొంది. ఎక్కువ సీట్లను పొందితేనే కూటమిలో ఉంటామని అనడం సరికాదని సూచించింది. ముందుగా అధికారంలోకి రావాల్సి ఉందని, అప్పుడు ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం దక్కుతుందని పేర్కొంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మొత్తం 48 సీట్లకు గాను బీజేపీ 23 స్థానాల్లో, శివసేన 18 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల కోసం బీజేపీ డిమాండ్ చేస్తోంది.