ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? | Exchange-Traded Fund (ETF) | Sakshi
Sakshi News home page

ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?

Published Mon, Apr 13 2015 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?

ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?

ఈటీఎఫ్‌లు అంటే ఏమిటి? వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
- రాజేశ్, విజయనగరం
 ఈటీఎఫ్ అంటే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని అర్థం.  బాగా పాపులర్ అయిన ఫండ్‌గా నిఫ్టీ ఈటీఎఫ్‌ని పేర్కొనవచ్చు.  మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్ని ఆ ఫండ్‌హౌస్ ద్వారా గానీ, బ్యాంక్ ద్వారా గానీ మరే ఇతర మార్గాల్లో గానీ కొనుగోలు చేయవచ్చు. కానీ ఈటీఎఫ్‌లను షేర్లలాగా కొనుగోలు చేయాలి. అంటే మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మీరు మ్యూచువల్ ఫండ్‌ను ఆ ఫండ్ ఎన్‌ఏవీ(నెట్ అసెట్ వ్యాల్యూ) ఆధారం గా కొనుగోలు చేయాలి. ఇక ఈటీఎఫ్‌ను మామూలుగా షేర్లను కొనుగోలు చేసినట్లుగానే మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలి. ఈటీఎఫ్‌లకు ఉన్న మంచి సానుకూలాంశం ఏమిటంటే, అవి చౌకగా లభిస్తాయి. అయితే ఈటీఎఫ్‌ల కంటే చురుగ్గా నిర్వహించే సాధారణ మ్యూచువల్ ఫండ్ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే అధికంగా రాబడులు వస్తాయి.
 
 నేను గత కొన్నేళ్లుగా హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ, యూటీఐ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ, సుందరం మిడ్‌క్యాప్, ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను 2-3 ఏళ్ల పాటు ఫ్రాంక్లిన్ స్మాలర్ కంపెనీస్, సుందరం స్మైల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా?
 - అనంత్, నెల్లూరు
 గత కొంత కాలంగా స్మాల్-క్యాప్ ఫండ్స్ మంచి పనితీరునే కనబరిచాయి. అయితే భవిష్యత్తులో వాటి పనితీరు ఎలా ఉంటుందో చెప్పలేం. 2-3 ఏళ్ల కాలానికి స్మాల్-క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, వస్తే భారీ లాభాలు రావచ్చు. లేదంటే అంతే స్థాయిలో నష్టాలూ రావచ్చు. ఇక మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్‌ను చూస్తే, వాటి పోర్ట్‌ఫోలియోల్లో మిడ్-క్యాప్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఏదైనా స్మాల్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ రాబడుల్లో పెద్ద గా మార్పులు ఉండకపోవచ్చు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి.
 
 ఏడాది కాలం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ మిడ్-క్యాప్ ఆపర్చునిటీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఇప్పుడు నేను విక్రయించుకోవచ్చు. అయితే ఇప్పు డు కాకుండా ఈ ఏడాది డిసెంబర్‌లో విక్రయించాలనుకుంటున్నాను. అలా చేస్తే నాకు ఈ నెలలో ఉన్నటువంటి ఎన్‌ఏవీనే వస్తుందా? వివరించగలరు.                  
 - నూర్జహాన్, హైదరాబాద్
 మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్.. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్... ఇలాంటి ఫండ్స్ యూనిట్లను ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. ఏరోజున మీరు ఈ ఫండ్స్‌ను విక్రయిస్తారో, ఆ రోజున ఉన్నటువంటి ఎన్‌ఏవీకే మీకు సొమ్ములు వస్తాయి. మీరు ఏప్రిల్‌లో విక్రయిస్తే, ఏప్రిల్ నాటి ఎన్‌ఏవీ, డిసెంబర్‌లో విక్రయిస్తే డిసెంబర్ నాటి ఎన్‌ఏవీ లభిస్తుంది. వీటిని ఎందుకు విక్రయించాలనుకుంటున్నారో మీరు కారణాలు వెల్లడించలేదు. ఈక్విటీ ఫండ్స్‌లో కనీసం 3-5 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తేనే మంచి రాబడులు వస్తాయి. ఇల్లు కొనడం, పిల్లల చదువు, కారు కొనడం వంటి తదితర ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఈ లక్ష్యాలు ఆసన్నమైనప్పుడు మాత్రమే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే బావుంటుంది. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోకండి.
 
 కోటక్ గోల్డ్ ఫండ్ యూనిట్లను విక్రయించాలనుకుంటున్నాను. నేను ఎలాంటి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది? దీర్ఘకాల లేదా స్వల్పకాల మూలధన లాభాల పన్ను, వీటిల్లో ఏది వర్తిస్తుంది? ఈ ఫండ్‌లో ఎన్ని సంవత్సరాలు కొనసాగితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది?
 - సీతారామారావు, వరంగల్
 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం చూస్తే కోటక్ గోల్డ్ ఫండ్ అనేది ఈక్విటీ ఫండ్ కాదు. దేశీయ ఈక్విటీల్లో ఇది తన కార్పస్‌లో 65 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయడం లేదు కాబట్టి దీనిని ఈక్విటీ యేతర ఫండ్‌గా పరిగణిస్తారు. ఇలాంటి ఫండ్స్‌లో మూడేళ్లు, అంతకు మించిన కాలం ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగిస్తేనే మీకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. మూడేళ్లలోపే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే, స్వల్పకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. మీ ఆదాయపు పన్ను స్లాబుననుసరించి పన్ను ఉంటుంది. ఒకవేళ మూడేళ్లకు మించితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement