ఇండియా అంతా ఇక్కడే | Exclusive sneak peek: New Mumbai airport T2 terminal | Sakshi
Sakshi News home page

ఇండియా అంతా ఇక్కడే

Published Fri, Jan 10 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM

విమానాశ్రయంలో జీవీ కృష్ణారెడ్డి

విమానాశ్రయంలో జీవీ కృష్ణారెడ్డి

  • అద్భుత చిత్రాలు, కళాకృతులతో ఎయిర్‌పోర్టు
  •  రూ.5,200 కోట్లతో జీవీకే ముంబై టెర్మినల్
  •  నేడు ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం
  •  త్వరలో కొంత వాటా విక్రయిస్తాం:     జీవీకే చైర్మన్ జీవీ కృష్ణారెడ్డి
  •   ముంబై నుంచి ఎం. రమణమూర్తి
     బయట దృఢంగా రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా... జాతీయ పక్షి నెమలికి నీరాజనం పడుతున్నట్లుగా నెమలి కన్నును తలపించే ప్రతి అడుగూ, ప్రతి ఆకృతీ!. జయహే... అంటూ భారతదేశంలోని ప్రతి రాష్ట్ర సంసృ్కతినీ, కళనూ కళ్లకు కట్టే నిలువెత్తు చిత్రాలు, కళాకృతులు. జాతీయ పుష్పం కమలాన్ని తలపిస్తూ... విరిసీ విరియని వివిధ రకాల్లో షాండ్లియర్లు... సరిగమలు పలికే జలతారలు. మొత్తంగా నిలువెత్తు భారతీయతకు ప్రతిరూపంలా నిలుస్తున్న ముంబై విమానాశ్రయం టెర్మినల్-2ను... మన రాష్ట్ర కంపెనీ నిర్మించటమే అన్నిటికన్నా అద్భుతం. ఏడు నక్షత్రాల హోటల్లా... ఒక మ్యూజియంలా... దీన్ని ఆవిష్కరించడానికి... తన కుమారుడు సంజయ్ పట్టుదలే కారణమని గురువారం ‘సాక్షి’ ప్రతినిధిలో చెప్పారు జీవీకే సంస్థల అధిపతి జి.వి.కృష్ణారెడ్డి. ‘‘మొత్తం భారతీయ కళలన్నీ ప్రతిబింబించేలా ఎయిర్‌పోర్టును తీర్చిదిద్దుతానని మా అబ్బాయి చెప్పినపుడు అంత ఖర్చు ఎందుకని నేనే వద్దన్నాను. కానీ తను నన్ను ఒప్పించి ముందుకెళ్లాడు. ఇప్పుడు చూశాక నాకే అనిపిస్తోంది. తనకు ఎంతో ఇష్టం లేకపోతే తప్ప ఇది సాధ్యమై ఉండేది కాదని. ఏదేమైనా ఒక అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా తరవాత కూడా ఇది చిరస్థాయిగా ఉంటుంది’’ అన్నారాయన. శుక్రవారం దీన్ని ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తారు. మరో 3-4 వారాల్లో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు  ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గురువారం విమానాశ్రయాన్ని విలేకరులకు చూపిస్తూ జీవీకే ఈ వ్యాఖ్యలు చేశారు.
     
     ఎస్‌ఓఎం కంపెనీ డిజైన్‌తో...
     ఈ ఎయిర్‌పోర్టును ప్రపంచ అగ్రగాముల్లో ఒకటైన న్యూయార్క్ సంస్థ ‘స్కిడ్‌మోర్, ఓయింగ్స్ అండ్ మెరిల్ (ఎస్‌ఓఎం)’ డిజైన్ చేసింది. ‘‘డిజైన్ చేయడానికి ఎస్‌ఓఎం ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. కొన్ని డి జైన్లు చూపించారు. కానీ అవేవీ ఓకే చేయకుండా వాళ్లను ఓ నెలరోజులు ఇండియా మొత్తం తిరిగి రమ్మన్నాం.

    వాళ్లు అన్ని రాష్ట్రాల సంసృ్కతులూ, కళాకృతులూ చూసి వచ్చాక మాత్రమే పని ప్రారంభించమన్నాం. అలాగే చేశారు. అందుకే ఈ అద్భుతం సాధ్యమైంది. ఇప్పుడు ఎవరైనా ఇండియా మొత్తం చూడాలనుకుంటే ఇక్కడికి రావాలి’’ అని జీవీకే వివరించారు.

    ముంబయి విమానాశ్రయం మొత్తానికి 2000 ఎకరాలు కేటాయించినా... దాన్లో 600 ఎకరాలు ఇప్పటికీ మురికివాడలతోను, ఇతర ఆక్రమణలతోను నిండి ఉంది. కొద్ది స్థలంలోనే, గరిష్టంగా ఉపయోగపడేట్లుగా ఈ టెర్మినల్‌ను డిజైన్ చేశారు. కింద కార్పెట్ నుంచి పైకప్పు వరకు ప్రతిచోటా నెమలికన్ను డిజైన్ ఉండటం దీనికి అదనపు ఆకర్షణ.
     
     పోటీ పడి మన సత్తా చూపించాం...
     చిన్న పట్టణం నుంచి వచ్చిన తాము ముంబయి లాంటి సిటీలో, అక్కడి దిగ్గజాలను ఢీకొట్టి ఎయిర్‌పోర్టును నిర్మించగలిగామని జీవీకే చెప్పారు. ‘‘హోటళ్లే కాదు. జేగురుపాడు విద్యుత్ ప్రాజెక్టును చూసినా, జైపూర్ రోడ్డు ప్రాజెక్టును చూసినా మా ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. అలాగే ఎయిర్‌పోర్టులోనూ వైవిధ్యం చూపించాలనుకున్నాం. అందుకే కొత్త టెర్మినల్ నిర్మాణమనేది ఒప్పందంలో లేకపోయినా... ఆక్రమణలకు తగిన పరిహారమిస్తూ, వేరేచోట నిర్మాణాలు చేస్తూ ముందుకెళ్లాం. చాలా సవాళ్లు వచ్చినా అధిగమించాం. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో మెజారిటీ వాటా మాకే ఉంది. భవిష్యత్తులో అప్పులు తీర్చడానికి కొంత వాటా విక్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికోసం రూ.2,500 కోట్లు అప్పు తెచ్చాం. దాన్ని తీర్చడానికి కొంత వాటా అమ్మినా అధిక వాటా మాకే ఉండేలా చూసుకుంటాం. టెర్మినల్ నిర్మాణానంతరం మాకు 10 శాతం స్థలం వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకోవటానికి చేతికొచ్చింది. దాని లీజుకోసం ఇప్పటికే బిడ్లు పిలిచాం. ఇప్పటిదాకా దేశంలోకి రాని అంతర్జాతీయ బ్రాండ్లు కూడా కొన్ని ఈ టెర్మినల్‌లో తమ శాఖలు ఏర్పాటు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. ప్రకటనలు, స్టోర్లు... ఇలా ఆదాయం బాగానే ఉంటుందని భావిస్తున్నాం’’ అని వివరించారు.
     
     టెర్మినల్-2 ప్రత్యేకతలు...
       ఎయర్‌పోర్టు అభివృద్ధి వ్యయం: 12,500 కోట్లు
       టెర్మినల్-2 నిర్మాణానికైన ఖర్చు: రూ.5,200 కోట్లు
       మొత్తం విస్తీర్ణం: 45 లక్షల చ.అడుగులు
       ప్రయాణికుల సామర్థ్యం: ఏడాదికి 4 కోట్ల మంది
       లిఫ్ట్‌లు: 72; ఎలివేటర్లు: 48; ట్రావెలేటర్లు: 37
       మల్టీలెవల్ పార్కింగ్ సామర్థ ్యం: 5,200 కార్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement