
ఎగ్జిట్ పోల్స్‌తో దూకుడు
తాజాగా జరిగిన ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపాగా వేయనుందన్న అంచనాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. మిజోరం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోగలదన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సెంటిమెంట్‌కు ఊపునిచ్చాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి సెన్సెక్స్ ఆదిలోనే 457 పాయింట్లు జంప్‌చేసి 21,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. గరిష్టంగా 21,166ను తాకింది. ఆపై కొంతమేర నెమ్మదించినప్పటికీ రోజంతా లాభాల్లోనే కదిలింది. చివరకు 249 పాయింట్ల లాభంతో 20,958 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా 80 పాయింట్లు ఎగసి 6,241 వద్ద నిలిచింది. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి సైతం ఇంట్రాడేలో 61.53కు బలపడటం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చింది. దీంతో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది.
బ్యాంకింగ్ దూకుడు
బీఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకెక్స్ 4.5%, క్యాపిట్ గూడ్స్ 3.6% చొప్పున ఎగశాయి. ఐసీఐసీఐ 7%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 4.5% చొప్పున దూసుకెళ్లగా, యస్ బ్యాంక్, కెనరా, యాక్సిస్, యూనియన్ బ్యాంక్ 6-4% మధ్య జంప్ చేశాయి. ఇక క్యాపిటల్ గూడ్స్ షేర్లు ఏబీబీ, ఎల్‌అండ్‌టీ, భెల్ , క్రాంప్టన్ గ్రీవ్స్ 4% స్థాయిలో ఎగశాయి. ఈ బాటలో ఇతర దిగ్గజాలు మారుతీ, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్ 3.7-1.6% మధ్య పుంజుకున్నాయి.
హెల్త్‌కేర్ డీలా
వివిధ కారణాల నేపథ్యంలో హెల్త్‌కేర్ షేర్లు ఫైజర్, వైత్(ఎక్స్‌డివిడెండ్), స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్, జూబిలెంట్ లైఫ్(యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరికలు) 25-10% మధ్య పతనంకాగా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో, లుపిన్ సైతం 2.2-1.2% మధ్య నీరసించాయి. దీంతో హెల్త్‌కేర్ రంగం 1.5% నష్టపోయింది. ఇక ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు ఐటీసీ, హెచ్‌యూఎల్ 1% స్థాయిలో నష్టపోయాయి.
ఎఫ్‌ఐఐల జోరు
ఎఫ్‌ఐఐలు దాదాపు రూ. 1,152 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 674 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. కాగా, ట్రేడైన షేర్లలో 1,253 లాభపడగా, 1,258 డీలాపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌లో ఇన్‌ఫ్రా షేర్లు వెలుగులో నిలిచాయి. మిడ్‌క్యాప్స్‌లో ఐవీఆర్‌సీఎల్, కల్పతరు, ఎన్‌సీసీ, ఐడీఎఫ్‌సీ, జిందాల్ స్టెయిన్‌లెస్, హెచ్‌సీసీ, స్వాన్ ఎనర్జీ, జీవీకే పవర్, జేఎంసీ ప్రాజెక్ట్స్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా 18-6% మధ్య దూసుకెళ్లాయి.