
పడగొట్టిన ‘ఫెడ్’!
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) ఆర్థిక ఉద్దీపన కోసం విడుదల చేస్తున్న నిధుల్ని క్రమేపీ తగ్గించే ప్రక్రియను త్వరలోనే మొదలుపెడుతుందన్న భయాలతో స్టాక్ సూచీలు వరుసగా రెండోరోజు భారీ నష్టాల్ని చవిచూసాయి. గురువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. దాంతో 406 పాయింట్లు పతనమై 20,229 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకేరోజున ఇంతగా క్షీణించడం రెండున్నర నెలల తర్వాత ఇదే ప్రధమం. సెప్టెంబర్ 3న సెన్సెక్స్ 652 పాయింట్లు పడింది. బుధ, గురువారాల్లో కలిపి 662 పాయింట్లు తగ్గింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ 124 పాయింట్ల నష్టంతో 6,000 పాయింట్ల దిగువన ముగిసింది.
ఫెడ్ ఎఫెక్ట్ ఏమిటి....
బ్యాంకింగ్ వ్యవస్థలోకి అమెరికా ఫెడ్ విడుదల చేస్తున్న పుష్కల నిధుల ఫలితంగానే కొద్ది నెలల నుంచి ఇండియాతో సహా పలు ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు పెరుగుతున్నాయి. ప్రతీ నెలా 85 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను బ్యాంకుల నుంచి కొనుగోలుచేయడం ద్వారా ఫెడ్ వ్యవస్థలోకి నిధుల్ని విడుదల చేస్తుంది. అయితే ఇటీవల అమెరికా ఆర్థికవ్యవస్థ కోలుకుంటున్నట్లు గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫెడ్ బాండ్ల కొనుగోలుకు నిర్దేశించుకున్న మొత్తాన్ని క్రమేపీ తగ్గిస్తుందన్న(టేపరింగ్) అంచనా లు ఇటీవల పెరిగాయి. ఆర్థికాభివృద్ధికి సంబంధించి, మరింత మెరుగైన డేటా వెలువడేంతవరకూ ఉద్దీపన ప్యాకేజీ కొనసాగుతుందంటూ ఫెడ్ ప్రస్తుత ఛైర్మన్ బెన్ బెర్నాంకీ, కాబోయే ఛైర్‌పర్సన్ జెనెత్ యెలెన్‌లు ఇటీవల ప్రకటించినా, మార్కెట్లో మాత్రం టాపరింగ్ భయాలు వారానికోమారు తలెత్తుతూనే వున్నాయి. బుధవారం వెల్లడైన ఫెడ్ కమిటీ సమావేశపు మినిట్స్ ఈ భయాలను మరింత పెంచాయి. అక్టోబర్ చివరివారంలో జరిగిన ఫెడ్ కమిటీ సమావేశానికి సంబంధించిన ఈ మినిట్స్ ప్రకారం...ఆర్థిక వ్యవస్థ ఆశించినరీతిలో కొలుకుంటున్నందున బాండ్ల కొనుగోలు మొత్తాన్ని తగ్గించడం మంచిదన్న అభిప్రాయాన్ని కమిటీ సభ్యులు వ్యక్తంచేసారు. ఈ మినిట్స్ ఫలితంగా బంగారం, వర్థమాన మార్కెట్ల షేర్లు, కరెన్సీలు క్షీణించడం, డాలరు బలపడటం జరిగింది.
అన్ని రంగాల్లోనూ అమ్మకాలు...
అన్ని రంగాల షేర్లనూ ఇన్వెస్టర్లు విక్రయించారు. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో పతనశాతం ఎక్కువగా వుంది. మరోవైపు రూపాయి మారకపు విలువ 63 స్థాయికి తగ్గినా, ఐటీ, ఫార్మా షేర్లు కూడా లాభాల స్వీకరణ ఫలితంగా క్షీణించాయి. ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌లు నాలుగూ కలిపి సెన్సెక్స్‌లో 171 పాయింట్ల నష్టానికి కారణమయ్యాయి. వీటిలో పాటు సిమెంటు షేర్లు ఏసీసీ, అంబూజా సిమెంట్ లతో పాటు యాక్సిస్‌బ్యాంక్, సేసా స్టెరిలైట్, లార్సన్ అండ్ టూబ్రోలు 3-4 శాతం మధ్య తగ్గాయి. మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు కెనరా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్‌లు 4-5 శాతం మధ్య పడిపోయాయి.
ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో బుల్ ఆఫ్‌లోడింగ్....
నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టుతోపాటు ప్రధాన స్టాక్ ఫ్యూచర్స్ నుంచి ఇన్వెస్టర్లు వైదొలగడంతో దాదాపు అన్ని కాంట్రాక్టుల్లోనూ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) కట్ అయ్యింది. ఈ ఏడాది మంచి లాభాలందించిన ఫ్యూచర్ పొజిషన్లను సంవత్సరాంతపు లాభాల స్వీకరణలో భాగంగా విదేశీ ఇన్వెస్టర్లు విక్రయిస్తున్నారని, ప్రస్తుత మార్కెట్ పతనానికి ఈ బుల్ ఆఫ్‌లోడింగ్ కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్ ఓఐ నుంచి తాజగా 13.86 లక్షల షేర్లు కట్ అయ్యాయి. 6,000, 6,100 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ కారణంగా ఈ ఆప్షన్లలో ఓఐ వరుసగా 25 లక్షలు, 16 లక్షల షేర్ల మేర పెరిగింది. 6,100 పుట్ ఆప్షన్ నుంచి 13 లక్షల షేర్లు కట్‌కాగా, 6,000 పుట్ ఆప్షన్లో స్వల్పంగా 1.11 లక్షల షేర్లు యాడ్ అ య్యాయి. 6,000 పుట్ ఆప్షన్‌లో మొత్తం ఓఐ 58 లక్షల షేర్లవరకూ వుండగా, 6,100 కాల్ ఆప్షన్లో 50.52 లక్షల షేర్ల బిల్డప్ వుంది. సమీప భవిష్యత్తులో 6,000పైన నిఫ్టీ స్థిరపడితే 6,100 స్థాయిని చేరవచ్చని, 6,000 మద్దతును అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే మరింత పతనం కావొచ్చని డేటా సూచిస్తున్నది.