
ఆ విషయంలో ఫేస్‌బుక్ ఫెయిలైంది!
వాషింగ్టన్: లైంగికంగా అసభ్యంగా, అశ్లీలంగా ఉన్న పిల్లల ఫొటోలను తన వెబ్‌సైట్ నుంచి తొలగించడంలో ఫేస్‌బుక్ విఫలమవ్వడం విమర్శలకు తావిస్తోంది. బాలలను లైంగికంగా చూపించే ఫొటోల గురించి యూజర్లు ఫిర్యాదు (రిపోర్ట్) చేసినా.. చాలావరకు వాటిని ఫేస్‌బుక్ తొలగించడం లేదని తాజాగా తేలింది. ఇలాంటి ఫొటోలకు సంబంధించిన ఆధారాలను తాజాగా బీబీసీ ఫేస్‌బుక్‌కు అందించింది. అయితే, ఆ ఫొటోలలో 20శాతం కన్నా తక్కువవాటినే ఫేస్‌బుక్ తొలగించింది. ఈ ఫొటోలను తొలగించడానికి బదులు.. ప్రైవేటు గ్రూపులలో షేర్ చేసుకున్న ఈ ఫొటోల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా బీబీసీకి ఫేస్‌బుక్ హితబోధ చెప్పింది.
పిల్లల పట్ల లైంగిక వేధింపులు, లైంగిక చర్యలకు ఆసక్తి చూపే నికృష్ట ప్రవృత్తి కలిగిన ప్రైవేటు గ్రూపులకు సంబంధించి దాదాపు 100 అంశాలను బీబీసీ ఫేస్‌బుక్ దృష్టికి తీసుకెళ్లింది. పలువురు చిన్నారుల రియల్ ఫొటోలను పెట్టి.. దానికింద అసభ్యకరమైన వ్యాఖ్యలు రాసి ఉంచిన విషయాన్ని ఫిర్యాదు చేసింది. అయితే, ఇందులో ఓ ఫొటో ఫేస్‌బుక్ కమ్యూనిటీ ప్రమాణాలకు ఉల్లంఘన కాదంటూ ఫేస్‌బుక్ గతంలో పేర్కొంది. అంతేకాకుండా ఆ ఫొటో ఇప్పటికీ సైట్‌లో దర్శనమిస్తోందని బీబీసీ తెలిపింది. అయితే, తమ సైట్‌లో ఉన్న కంటెంట్‌ను జాగ్రత్తగా సమీక్షించి.. అక్రమంగా, తమ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నవాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని ఫేస్‌బుక్ పేర్కొంటున్నది.