మరో మైల్‌స్టోన్ అధిగమించిన మెసెంజర్
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌కు చెందిన మెసెంజర్ యాప్ మరో రికార్డును సొంతం చేసుకుంది. యూజర్ల సంఖ్యలో మరో కీలకమైన రికార్డును సొంతం చేసుకుంది. గత ఎనిమిది నెలల్లో మొత్తం 200 మిలియన్ల కొత్త యూజర్లను జతచేసుకుని మరో మైలురాయిని అధిగమించింది. రికార్డు స్థాయిలో 1.2 బిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 20 శాతం మంది యూజర్లను తన ఖాతాలో వేసుకుంది.
ప్రతినెలా 1.2 బిలియన్ యాక్టివ్ యూజర్లు నమోదవుతున్నారని ఫేస్‌బుక్ హెడ్ ఆఫ్ మెసెంజర్ డేవిడ్ మార్కస్ తెలిపారు.దీంతో వివిధ ఫీచర్లతో విశేష ఆదరణ పొందుతున్న సమీప భవిష్యత్తులో నెలకు 1.5 లేదా 2 బిలియన్ల యూజర్లను సాధించడం అంత కష్టమేమీకాదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లకు 200 మిలియన్ల మంది, ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల యూజర్లు ఉన్నారు. నెలకు 1 బిలియన్ యూజర్లతో ఫేస్‌బుక్ మూడు యాప్ లను కలిగి ఉండగా, గూగుల్ కుచెందిన 7 యాప్‌లు ఈ 1 బిలియన్ క్లబ్ లో ఉన్నాయి.
మరోవైపు రాబోయే సం.రాల్లో మెసెంజర్ యాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఒకవిప్లవం కానుందని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ విశ్వాసం. భారీ లాభాలను ఆర్జిస్తున్న ఫేస్‌బుక్ తన ఇతర యాప్ ల రెవెన్యూలపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 1.2 బిలియన్ యూజర్లద్వారా ప్రకటనలపై వచ్చే ఆదాయంపై ఫోకస్ పెట్టనుంది.