రైతు ఆత్మహత్యలపై అఖిలపక్షం వేయాలి: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల నివారణకు, వ్యవసాయసంక్షోభాన్ని అధిగమించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ రంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీలు, రుణాలు, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం వంటివాటిపై విస్తృతంగా చర్చించాలని కోరారు.
వ్యవసాయరంగంపై ఇంకా నిర్లక్ష్యం తగదని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న రైతుల్లో మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత అన్ని రాజకీయపార్టీలపై ఉందని అభిప్రాయపడ్డారు. దేశాన్ని ఇప్పటిదాకా అభివృద్ధి చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నదని ఆయన ఆరోపించారు. పారిశ్రామికరంగ అభివృద్ధికోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలను అడ్డుకుంటోందని విమర్శించారు. దీనివల్ల పారిశ్రామిక రంగం దెబ్బతిని, ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోతారని హెచ్చరించారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి చర్యలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక బిల్లును తీసుకురానున్నట్టు ఆయన వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు తప్పదన్నారు. వార్డుల విభజనలో సహజ ప్రమాణాలను పాటించాలని, రాజకీయ లబ్ధికోసం తప్పుడు విధానాలను అవలంభించవద్దని దత్తాత్రేయ సూచించారు. వార్డుల విభజనకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు.