మరణ శిక్షా.. జీవిత ఖైదా?
సాక్షాత్తు దేశ రాజధానిలోనే కదులుతున్న బస్సులో అత్యంత ఘోరంగా.. పాశవికంగా సామూహిక అత్యాచారం చేసిన కేసులో నిందితులకు ఐదేళ్ల తర్వాత శిక్ష ఖరారు కానుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఎట్టకేలకు తీర్పు రానుంది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరిశిక్ష విధించాలా, లేదా జీవిత ఖైదుతో సరిపెట్టాలా అనే విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చనుంది. వాస్తవానికి ఈ కేసులో 2013లోనే ప్రత్యేక కోర్టు ఈ నలుగురికీ ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పగా, హైకోర్టు కూడా మరుసటి సంవత్సరం దాన్ని ఖరారు చేసింది. అయితే, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్.. ఈ నలుగురు నిందితులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడంతో తుది తీర్పు వెలువడేందుకు ఇన్నాళ్ల సమయం పట్టింది.
2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ బస్సులో ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. దీనిపై కూడా దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం చెలరేగింది. దాంతో ఇప్పుడు బాలనేరస్తుల చట్టాన్ని కూడా సవరించారు. 16-18 ఏళ్ల మధ్య వయసున్నవారు తీవ్రమైన నేరాలు చేస్తే వారిని పెద్దవాళ్లు గానే భావించాలని చెప్పారు. ఫిజియోథెరపీ చదువుతున్న నిర్భయ తన స్నేహితుడితో కలిసి దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో బస్సు ఎక్కగా, అతడిని చితక్కొట్టి ఆమెపై ఆరుగురు కలిసి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు.
ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురు చేసుకున్న అప్పీలుపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్. భానుమతిలతో కూడిన సుప్రీం ధర్మాసనం తన తుది తీర్పును శుక్రవారం వెల్లడించబోతోంది. న్యాయమూర్తులిద్దరూ వాళ్ల అప్పీలును తిరస్కరిస్తే, ఇక వారికి ఉరిశిక్ష దాదాపు ఖరారవుతుంది. అయితే అప్పటికీ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరేందుకు అవకాశం ఉంటుంది, లేదా రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయొచ్చు.