
నిమిషాల్లో నేరగాళ్ల వేలిముద్రలు!
నేరస్తులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించే వేలిముద్రలను క్షణాల్లో అధ్యయనం చేసే దిశగా రాష్ట్ర పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
- కొత్త సాఫ్ట్‌వేర్‌ను పరిశీలిస్తున్న సీఐడీ
- ప్రస్తుత పద్ధతిలోని నిరీక్షణకు తెరదించేందుకే
సాక్షి, హైదరాబాద్: నేరస్తులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించే వేలిముద్రలను క్షణాల్లో అధ్యయనం చేసే దిశగా రాష్ట్ర పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్ముకున్న పోలీసులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. ఇది క్షణాల్లో వేలిముద్రలను స్కాన్ చేసి పాత నిందితుల వివరాలను ఇట్టే పసిగట్టగలగడంతోపాటు కొత్త నేరస్తులను పట్టుకోవడంలోనూ సాయపడుతుంది. ఈ పరిజ్ఞానాన్ని క్రైం అండ్ క్రిమినల్ టెక్నాలజీ నెట్‌వర్కింగ్ సిస్టం (సీసీటీఎన్‌ఎస్)కు అనుసంధానించాలని కూడా పోలీసుశాఖ యోచిస్తోంది. దీని ద్వారా నేరస్తులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నా సులువుగా గుర్తించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. కొత్త టెక్నాలజీ సాధ్యాసాధ్యాలను సీఐడీ ఆధ్వర్యంలోని ఫింగర్ ఫ్రింట్ బ్యూరో పరిశీలిస్తోంది. త్వరలో దీన్ని పట్టాలెక్కించేందుకు వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే సంఘటనా స్థలంలో దొరికే వేలిముద్రలను ఇది వరకే భద్రపరిచిన వాటితో విశ్లేషించే పని నిమిషాల్లో పూర్తవుతుంది. వివిధ కేసుల్లో వందల మంది సాక్షులు ఇచ్చే సమాచారం కన్నా నిందితుల వేలిముద్రల సాక్ష్యాలు బలమైనవి. గతంలో వేలిముద్రల గుర్తింపు కోసం నెలల తరబడి సమయం వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇండో ఎక్స్‌పో-10 అనే సాఫ్ట్‌వేర్ ద్వారా పనిభారం కాస్త సులభమైనప్పటికీ ఇది కూడా నిర్ధారించాల్సిన వేలిముద్రలను పోలిన ఐదారు ముద్రలను గుర్తిస్తోంది. దీంతో వాటిని నిపుణులు మళ్లీ పరిశీలించి సరైన వాటిని నిర్ధారించేందుకు 2-3 వారాల సమయం పట్టేది. కొత్త సాఫ్ట్‌వేర్‌తో నిమిషాల్లోనే నేరస్తులను గుర్తించే వీలుందని పోలీసులు భావిస్తున్నారు.
సీసీటీఎన్‌ఎస్‌తో దేశవ్యాప్తంగా అనుసంధానం..
సమాచారమార్పిడి లోపాన్ని నివారించేందుకు దేశంలోని అన్ని పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాలను అనుసంధానిస్తూ కేంద్రం సీసీటీఎన్‌ఎస్ వ్యవస్థను రూపొందిం చింది. దీనికి వేలిముద్రల సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించి నేరస్తుల గుట్టును సులువుగా పసిగట్టేయవచ్చని పోలీసులుశాఖ భావి స్తోంది. వేలిముద్రలను సీసీటీఎన్‌ఎస్‌కు అనుసంధానిస్తే నేరస్తుల సమాచారం దేశంలోని అన్ని పోలీసుస్టేషన్లలో ప్రత్యక్షమవుతుంది.
నిందితులు ఇతర ప్రాంతాల్లో మరేవైనా నేరాలు చేస్తూ పట్టుబడితే వేలిముద్రల ఆధారంగా వారి సమగ్ర సమాచారం ఇట్టే తెలిసిపోతుంది. వేలిముద్రలను నేరుగా ఫింగర్ ఫ్రింట్ బ్యూరోకు అనుసంధానించేందుకు మహారాష్ట్రలో అమలవుతున్న పద్ధతులను అనుసరించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇది వరకే అధికారుల బృందం మహారాష్ట్రలో పర్యటించి అక్కడి విధానాన్ని అధ్యయనం చేసింది