కింగ్‌ఫిషర్, మాల్యాపై ఎఫ్‌ఐఆర్
బెంగళూరు: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యాపై క్రిమినల్ అభియోగాల కింద బెంగళూరులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యూడీఎఫ్), ప్యాసింజర్ సర్వీసు ఫీజులు (పీఎస్‌ఎఫ్) చెల్లించనందుకు గాను బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (బీఐఏఎల్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీపీ కమల్‌పంత్ తెలిపారు.
బీఐఏఎల్ ఈ విషయంపై ఈ నెల 21న మేజిస్ట్రేట్ కోర్టుకు ఫిర్యాదు చేయగా, కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బీఐఏఎల్ పోలీస్ స్టేషన్ ఈ మేరకు చర్య తీసుకున్నట్లు వివరించారు. సంస్థ వర్గాల ప్రకారం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సుమారు రూ. 208 కోట్లు బకాయిపడింది. మరోవైపు, బీఐఏఎల్ ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ నమోదు కాపీలు తమకి అందలేదని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాతృసంస్థ యూబీ గ్రూప్ తెలిపింది. ఒకవేళ దర్యాప్తు ప్రారంభమైన పక్షంలో విచారణలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని యూబీ గ్రూప్ ప్రతినిధి చె ప్పారు.