కాలిన గాయాలకు చేప చర్మంతో చికిత్స | fish skin therapy for burn injuries | Sakshi
Sakshi News home page

కాలిన గాయాలకు చేప చర్మంతో చికిత్స

Published Sat, Dec 17 2016 3:55 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

కాలిన గాయాలకు చేప చర్మంతో చికిత్స

కాలిన గాయాలకు చేప చర్మంతో చికిత్స

బ్రెసీలియా: కాలిన గాయాలకు చికిత్స చేయడంలో బ్రెజిల్‌ డాక్టర్లు కొత్త థెరపీకి తెరతీశారు. కాలిన గాయాలకు బర్నాల్‌ లాంటి ఆయింట్‌మెంట్లను పూసి, బ్యాండేజ్‌వేసే పాత పద్ధతికి స్వస్తిచెప్పి మంచినీళ్లలో దొరికే చేపల చర్మాన్ని బ్యాండేజ్‌లుగా ఉపయోగించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం చేయడమే తమ దేశంలోనే మొదటిసారని వారు చెబుతున్నారు.

బ్రెజిల్‌లోని రూసాస్‌ నగరంలోని కాసా వెల్హా రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న మారియా క్యాండిడో డా సిల్వా 20 రోజుల క్రితం రెస్టారెంట్‌లో జరిగిన గ్యాస్‌ సిలిండర్‌ పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. ఎడమ చేతికి, గొంతుకు, ముఖంలో కొంత భాగానికి సెకండ్‌ డిగ్రీ గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంటను తట్టుకోలేకపోతున్నానంటూ , మంట తగ్గడానికి ఏదో ఒకటి చేయమని ఆమె డాక్టర్లను వేడుకుంది. చేప చర్మంతో బ్యాండేజ్‌ వేసే కొత్త పద్ధతి అమల్లోకి తీసుకొస్తున్నామని, దాన్ని ఉపయోగిస్తే నొప్పి త్వరగా తగ్గుతుందని డాక్టర్లు ఆమెకు సలహా ఇచ్చి అలాగే చేశారు.

‘చేప చర్మాన్ని కాలిన గాయాలకు బ్యాండేజ్‌లాగా వేయడంలో గాయాలు చల్లబడ్డాయి. కాసేపటికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత రెండు, మూడు రోజులకోసారి వెళ్లి బ్యాండేజ్‌ మార్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు మొత్తం గాయాలు తగ్గాయి’ అని మారియా మీడియాకు వివరించారు. మంచినీటిలో పెరిగే చేపల చర్మలో ఇన్‌ఫెక్షన్‌ను తట్టుకునే గుణంతోపాటు చర్మంలో తేమ ఎక్కువ సేపు ఉంటుందని, పోషక పదార్థాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. బ్రెజిల్‌లో మంచినీటి చేపలే ఎక్కువ దొరుకుతాయని, దేశంలో 90 శాతం మంది ప్రజలు చేపల చర్మాన్ని చెత్తలో పడేస్తారని, దానికి బదులుగా ఆస్పత్రులకు విరాళంగా అందజేస్తే కాలిన గాయాలకు ఉపయోగించవచ్చని వారు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement