బలపరీక్ష ఎప్పుడు పెట్టినా ఇంతే!
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మీద విశ్వాస పరీక్ష ఎప్పుడు నిర్వహించినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తీవ్ర గందరగోళం, సభలో సభ్యుల కేకలు, అరుపులు.. సభను సజావుగా నడవనివ్వకపోవడం లాంటివి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. ఇంతకుముందు ఎంజీఆర్ మరణం అనంతరం జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాల మధ్య పోటీ తలెత్తినప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించారు. 1988 జనవరి 27వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించారు. అప్పుడు అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి, అసెంబ్లీలో కొట్టుకుంటున్న సభ్యులను నియంత్రించేందుకు తొలిసారి సభలోకి పోలీసులను కూడా పిలవాల్సి వచ్చింది. జయలలిత వర్గానికి నెడుంజెళియన్ నాయకత్వం వహించారు. సభ్యులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు కూడా. అప్పుడు స్పీకర్ పీహెచ్ పాండియన్ చాలామంది ప్రతిపక్ష సభ్యులపై ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు.
ఇప్పుడు కూడా విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొనడం, స్పీకర్ చొక్కా చించి అవమానించడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తనకు జరిగిన అవమానానికి తాను ఎవరికి చెప్పుకోవాలని స్పీకర్ ధనపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ముందున్న టేబుల్‌ను పడగొట్టేసి, ఆయన కుర్చీలో కూర్చుని, బెంచీల మీదకు ఎక్కి, స్పీకర్‌ను నెట్టేసి.. ఇలా పలు రకాలుగా విధ్వంసం సృష్టించడంతో సభను దాదాపు గంట సేపు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సభ సమావేశమైనప్పుడు డీఎంకే సభ్యులందరినీ బయటకు వెళ్లాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు. వాళ్లను బయటకు తీసుకెళ్లాల్సిందిగా మార్షల్స్‌కు సూచించారు. అయితే డీఎంకే ఎమ్మెల్యేలు మళ్లీ పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌ను ఘెరావ్ చేసి నినాదాలు చేయడం మొదలుపెట్టారు.