సానుభూతి ఓట్ల కోసం సోదరుడిని చంపించాడు
మీరట్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనోజ్ కుమార్ ఎన్నికల్లో గెలవడానికి దారుణమైన వ్యూహం పన్నాడు. సానుభూతి ఓట్ల కోసం సొంత సోదరుడిని, స్నేహితుడిని చంపించాడు. చివరకు నేరం చేయించినట్టు పోలీసుల విచారణలో తేలడంతో కటకటాలపాలయ్యాడు.
యూపీలోని ఖుర్జా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్ఎల్డీ అభ్యర్థిగా మనోజ్ కుమార్ గౌతమ్ పోటీ చేస్తున్నాడు. ఆయన తొలుత బీఎస్పీ టికెట్ కోసం ప్రయత్నించాడు. టికెట్ లభించకపోవడంతో ఆర్ఎల్డీ తరఫున బరిలో దిగాడు. కుటుంబ సభ్యుడిని చంపించి, రాజకీయ ప్రత్యర్థులు ఈ హత్య చేయించినట్టు ఆరోపించి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని పథకం వేశాడు. సోమవారం ఖుర్జాలో ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ కొడుకు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయంత్ చౌదరి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదే అదునుగా భావించిన గౌతమ్.. ఈ ర్యాలీ ముగిసిన వెంటనే తన సోదరుడు వినోద్, ఫ్యామిలీ ఫ్రెండ్ సచిన్‌లను చంపించాడు. కిరాయి హంతకులు వీరిద్దరిని తుపాకీతో కాల్చి చంపారు. ఓ మామిడి తోటలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా గౌతమే ఈ హత్యలు చేయించినట్టు తేలింది. పోలీసులు ఇంటరాగేషన్‌లో గౌతమ్ ఏడుస్తూ ఏమీ తెలియనట్టుగా నటించినా, తర్వాత నిజం అంగీకరించాడు. ఇద్దరు కిరాయి హంతకులకు లక్ష రూపాయలు ఇచ్చి, హత్యలు చేయించినట్టు చెప్పాడు. పోలీసులు ఓ హంతకుడిని, గౌతమ్‌ను అరెస్ట్ చేశారు. మరో హంతకుడు పరారీలో ఉన్నాడు.