ఏమంత గుడ్డు?
గుడ్డు వెరీగుడ్డంటారు. ‘సండే యా మండే.. రోజ్ ఖావ్ అండే..’ అంటూ ప్రకటనల్లో ఊదరగొడతారు. మనం తినే గుడ్డు ఏ మేరకు ‘గుడ్డో’ ఆ వైనాన్ని తెలుసుకుందాం.. గుడ్ల ఉత్పాదనలో రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్న బహుళ జాతి కంపెనీల విజయ రహస్యమేమిటని ప్రశ్నిస్తే, ‘అంతా మోల్టింగ్ దయ’ అంటారు.
బలవంతపు బతుకు...
కోడి గుడ్డు పెట్టే దశకు రావడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత నుంచి గుడ్లు పెట్టడం మొద లుపెడుతుంది. మొదటి రెండు మూడు నెలలూ చిన్న సైజు గుడ్లు పెడుతుంది. వాటి సైజు పెంచడం కోసం కొన్ని రకాల హార్మోన్లు కోడి శరీరంలోకి పంపిస్తున్నారు. గుడ్ల ఉత్పత్తికి నాలుగు నెలల వరకు ఎదురు చూడటం ఎందుకనుకునే ఆత్రగాళ్లు కొందరు కోళ్లకు ఈస్ట్రోజన్ హార్మోన్ ఇస్తున్నారు. దీని మోతాదు ఎక్కువైతే దుష్ఫలితాలు తప్పవనే వైద్యుల హెచ్చరికలను వీరు ఏమాత్రం పట్టించుకోరు.
నిర్బంధ నిరాహార పథకం..
ఫోర్స్‌డ్ మోల్టింగ్.. ఇదొక నిర్బంధ నిరాహార పథకం. ఏడాదికాలం నిర్విరామంగా గుడ్లుపెట్టి పెట్టి.. చివరకు బలమైన గుడ్లు పెట్టలేని స్థితికి చేరుకున్న కోళ్లను మిగిలిన గుంపు నుంచి వేరుచేసి, వాటిని పదిరోజులు కటిక ఉపవాసంలో ఉంచుతారు. చనిపోకుండా ఉండేందుకు, రోజుకు రెండుసార్లు నీళ్లు పట్టిస్తారంతే! నిర్బంధ నిరాహార పథకాన్ని తట్టుకోలేని కొన్ని కోళ్లు ఈ దశలోనే కన్నుమూస్తాయి. మిగిలిన వాటికి వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, చూడటానికే భయంకరంగా తయారవుతాయి. వాటి బరువు కూడా ఈ కాలంలో సగానికి సగం తగ్గిపోతుంది. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు చికిత్స. ఆకలితో ఆవురావురుమంటున్న కోడి ముందు చిన్నసైజు రాతిపొడి కుప్పపోస్తారు. అదే ఆహారం అనుకుని, కోడి ఆబగా తినేస్తుంది. కొన్నిరోజులు అలా రాళ్లు తింటూనే మనుగడ సాగిస్తుంది. తర్వాత మెల్లగా అసలు ఆహారం ఇవ్వడం మొదలుపెడతారు. గుడ్లుపెట్టే కోడి ఆహారంలో రోజూ కొంత మోతాదులో రాతిగుండ కలుపుతారు. కోడి శరీరంలో క్యాల్షియం స్థాయిని పెంచి, అది పెట్టే గుడ్ల పెంకు గట్టిగా ఉండేలా చూడటం కోసం పౌల్ట్రీ యజమానులు ‘మోల్టింగ్’ పేరిట కొన్నిరోజుల పాటు కోళ్లకు ప్రత్యక్ష నరకాన్ని చవిచూపిస్తారు. మోల్టింగ్ తర్వాత కోడికి పునరుజ్జీవం కల్పించడానికి రకరకాల హార్మోన్స్, యాంటీ బయోటిక్స్, చివరకు బోటాక్స్ వంటివి వాడుతున్నారు.
పిల్లల ఆరోగ్యం జాగ్రత్త..
మోల్టింగ్ తర్వాత కోడి శరీరంలోకి వెళ్లే మందుల పరిమాణం చాలా ఎక్కువ. కోళ్లకు ఇచ్చే మందుల ప్రభావం, అవి పెట్టే గుడ్లపైనా ఉంటుంది. ఇవి ముఖ్యంగా పసిపిల్లలకు చాలా హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ శివార్లలోని కొన్ని లేయర్ చికెన్ పౌల్ట్రీలకు వెళ్లినపుడు అక్కడి ఓ మహిళా కూలీ... ‘ఫారం కోడి చల్లగుండ. ఏడాది గుడ్డు పెట్టి ఊకోనీకి లేదు. దాన్ని ఉపాసం పెట్టి, రాళ్లు తినిపించి, ఎంట్రుకలు పోయి, ఇంజక్షన్లు పొడిపించుకుని... వామ్మో ఓ నెలదాకా పిచ్చి కోడి నరకం జూస్తది’ అని చెబుతుంది. పావురాలకు చిన్న హానిచేసినా, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితుల్లో, ముసలి కోళ్లకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న వారిని పట్టించుకునే నాథులే లేరు.