ముజాఫర్ నగర్(ఉత్తరప్రదేశ్): గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న హత్య కేసుల్లో ఏడుగురికి జీవితఖైదు పడింది. 2009 హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తే ముజాఫర్ నగర్ కోర్టు తీర్పు చెప్పింది. ఓ రైతును హత్య చేసిన ఘటనకు సంబంధించి కులదీప్, ప్రవీణ్, గౌరవ్, అమిత్ లకు జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. దీంతో పాటు రూ,10,000 జరిమానాగా చెల్లించాల్సిందిగా పేర్కొంది.
ఈ కేసును మంగళవారం విచారించిన న్యాయమూర్తి శ్యామ్ కుమార్ ఆ నలుగుర్ని ఆ హత్య కేసులో దోషులుగా పేర్కొంటూ శిక్షను ఖరారు చేశారు. 2009, డిసెంబర్ 18వ తేదీన వికాస్ జైన్ అనే రైతును మార్గ మధ్యంలో ఆడ్డగించిన వారు అతికిరాతంగా హత్య చేశారు. ఇదిలా ఉండగా మరో హత్య కేసులో ముగ్గురికి జీవితఖైదు విధిస్తూ జిల్లా జడ్జి మహ్మద్ ఆలీ తీర్పు చెప్పారు. 2002లో జరిగిన ఆ హత్య కేసులో అశోక్, ప్రవీణ్ కుమార్, లాలా అనే ముగ్గుర్ని దోషులుగా కోర్టు నిర్దారించింది. వీరికి రూ.30,000 చొప్పున జరిమానా చెల్లించాలంటూ కోర్టు స్పష్టం చేసింది.