నేడే నిమజ్జనం | Ganesh nimajjanam today all over Hyderabad | Sakshi
Sakshi News home page

నేడే నిమజ్జనం

Published Sun, Sep 27 2015 2:35 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

నేడే నిమజ్జనం

నేడే నిమజ్జనం

సగానికిపైగా హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం
నగరం చుట్టూ మరో 24 చెరువుల వద్ద ఏర్పాట్లు
ప్రతి 3 కి.మీ.కు ఒక గణేశ్ యాక్షన్ టీం
400 ప్రత్యేక బస్సులు, 8 ఎంఎంటీఎస్ రైళ్లు
శోభాయాత్రలో పాల్గొనే మొత్తం విగ్రహాలు 60,000
బందోబస్తు విధుల్లో పోలీసులు 30,000
ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య (సుమారుగా) 2,500

 
 సాక్షి, హైదరాబాద్: పదకొండు రోజులపాటు భక్తకోటి పూజలందుకున్న విఘ్నేశ్వరుడు నేడు నిమజ్జనానికి కదలనున్నాడు! ఆదివారం జరిగే నిమజ్జన మహాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగాలన్నీ రంగంలోకి దిగాయి. జీహెచ్‌ఎంసీ, పోలీసు, రవాణా, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖ, జలమండలి, హెచ్‌ఎండీఏ, ఆర్టీసీ తదితర విభాగాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా నిఘా కెమెరాలు, గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈసారి షీటీమ్స్ సైతం రంగంలోకి దిగాయి. భక్తులతో కిక్కిరిసిపోనున్న హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. శనివారం పోలీసులు ఖైరతాబాద్, బాలాపూర్ మహాగణపతుల నిమజ్జనానికి సంబంధించిన ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.
 
 ఈ ఏడాది సుమారు 60 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్నాయి. వీటిలో 50 శాతానికిపైగా హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం కానున్నాయి. ఈసారి బాలాపూర్ శోభాయాత్రతో నిమిత్తం లేకుండానే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తారు. మిగతా విగ్రహాలను నగరం చుట్టూ ఉన్న 24 చెరువుల్లో నిమజ్జనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మీరాలం ట్యాంకు, పల్లెచెరువు, పత్తికుంట చెరువు, దుర్గం చెరువు,సఫిల్‌గూడ చెరువు, రామసముద్రం, ఐడీఎల్ చెరువు, సున్నం చెరువుల వద్ద నిమజ్జన వేడుకలు జరుగనున్నాయి.
 
 జీహెచ్‌ఎంసీ సన్నద్ధం
ట్యాంక్‌బండ్‌తోపాటు మిగతా చెరువుల వద్ద నిమజ్జనం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. పారిశుధ్య పనుల కోసం 545 మంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్‌లు, 5,793 మంది కార్మికులు విధులు నిర్వహించనున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు, 21 మంది కార్మికులతో ‘గణేశ్ యాక్షన్ టీమ్’ ఏర్పాటు చేశారు. ప్రతి 3 నుంచి 4 కిలోమీటర్‌లకు ఒక టీమ్ పని చేస్తుంది. మొత్తం 180 బృందాలు 24 గంటల పాటు  పారిశుధ్య పనుల్లో నిమగ్నమై ఉంటాయి. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు అదనంగా కొన్ని వాహనాలను సైతం అద్దెకు తీసుకున్నారు.
 
ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. శోభాయాత్ర సాగే మార్గంలో రూ.13.55 కోట్లతో ఇప్పటికే రహదారులు మరమ్మతు చేశారు. రూ.39 లక్షలతో 23,353 తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ మార్గంలో 21 క్రేన్‌లు, ఎన్టీఆర్ మార్గంలో మరో 21 క్రేన్లను నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్లను కూడా జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది.
 
30 వేల మంది పోలీసులతో భద్రత

 జంట పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 30 వేల మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2,500కు పైగా నిఘా కెమెరాలు, మరో 10 మౌంటెడ్ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. సుమారు 150 షీటీమ్స్ రంగంలోకి దిగాయి. 60 బాంబు నిర్వీర్య బృందాలను మోహరించారు. 60 స్నిఫర్‌డాగ్స్‌ను కూడా రంగంలోకి దించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మొత్తం నిమజ్జన యాత్రను ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ‘భగవంతుని సేవలో భక్తులు.. భక్తుల సేవలో పోలీసులు’ అనే నినాదంతో పోలీసుల బలగాలు రంగంలోకి దిగాయి. 120 పెట్రోలింగ్ వాహనాలు, 17 ఇంటర్‌సెప్టర్‌లు, 88 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. ఘాట్‌ల వద్ద మరో 50 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.
 
400 ప్రత్యేక బస్సులు: ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు తరలి వచ్చేవారి కోసం ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నగరం నలుమూలల నుంచి బస్సులు లక్డీకాఫూల్, ఖైరతాబాద్, ఇందిరాపార్కుకు రాకపోకలు సాగిస్తాయి. నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు ప్రయాణికులకు బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఈడీ పురుషోత్తం నాయక్ తెలిపారు.దక్షిణ మధ్య రైల్వే 8 ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు ప్రతి అరగంటకు ఒకటి చొప్పున నాంపల్లి-సికింద్రాబాద్, ఫలక్‌నుమా-సికింద్రాబాద్, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో తిరుగుతాయి.
 
ఏర్పాట్లు పూర్తి చేశాం
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గణేశ్ యాక్షన్ టీమ్‌లు 24 గంటల పాటు విధి నిర్వహణలో ఉంటాయి. రహదారులు, వీధిదీపాల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నాం.ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ 040-21111111నంబర్‌కు ఫోన్ చేయొచ్చు.
 - సోమేశ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ స్పెషల్ ఆఫీసర్
 
 పోలీసులు క్షణాల్లో చేరుకుంటారు
 బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 400 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసులు క్షణాల్లో చేరుకొనే విధంగా ఏర్పాట్లు చేశాం.  
- మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement