
గౌరీ లంకేశ్ హత్య కేసుపై సిట్
♦ ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వం
♦ దేశవ్యాప్తంగా పౌర సంఘాలు, జర్నలిస్టుల నిరసనలు
♦ ప్రభుత్వ లాంఛనాలతో లంకేశ్ అంత్యక్రియలు పూర్తి
సాక్షి, బెంగళూరు: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ని ఏర్పాటుచేసింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కేసును చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, దర్యాప్తునకు ఇంటెలిజెన్స్ ఐజీ అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశామని మీడియాతో చెప్పారు. గౌరి కుటుంబ సభ్యులు కోరినట్లుగా సీబీఐ విచారణకూ తాము సిద్ధమేనని చెప్పారు. ఆమె హత్యపై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
మిన్నంటిన ఆందోళనలు
లంకేశ్ హత్యపై దేశవ్యాప్తంగా పాత్రికేయ సంఘాలు, పౌర సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశాయి. బెంగళూరు, ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించాయి. గౌరీ హత్య పత్రికా స్వేచ్ఛపై క్రూరమైన దాడి అని, ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలిపే వారిని భయపెట్టడమే అని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. లంకేశ్ హత్యను అమెరికా ఖండించింది. బుధవారం టీఆర్ మిల్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో లంకేశ్ అంత్యక్రియలు జరిగాయి. సీఎంసహా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
గౌరీ లంకేష్ హత్యతో కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగింది. దేశంలో స్వేచ్ఛావాదులు, జర్నలిస్టులు, హేతువాదులకు రక్షణ లేకుండా పోయిందని, అసమ్మతి తెలియజేసినా, సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నా వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆందో ళన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వారిపై దాడులకు తెగబడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. రాహుల్ ఆరోపణలు నిరాధారం, బాధ్యతారాహిత్యమని, కేంద్రానికి, బీజేపీకి, తమ పార్టీకి చెందిన ఏ సంస్థకూ ఈ హత్యతో సంబంధం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. గౌరీ లంకేశ్ హత్యను ముందుగా పసిగట్టడంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందంటూ జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ ఆరోపించారు.
లంకేశ్ ముప్పును ముందే ఊహించారా?
లంకేశ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందే ఊహించినట్లు ఆమె ట్వీటర్ పోస్ట్‌ల ఆధారంగా తెలుస్తోంది. ఆమె హత్యకు కొద్దిగంటల ముందు తన ట్వీటర్ ఖాతాలో ‘మనలో కొందరికి నకిలీ ఖాతాలతో నకిలీ పోస్ట్‌లు, బెదిరింపులు వస్తున్నాయి. వాటికి భయపడాల్సిన పని లేదు’ అని ఆమె పోస్ట్ చేశారు. నెలరోజులుగా తనకు కొంత మంది ఫోన్‌చేసి హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె తమ సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. కాగా, లంకేశ్ హత్యోదంతం వెనక ఉన్నది మావోయిస్టులా లేక మత ఛాందసవాదులా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కర్ణాటకలో నక్సల్స్‌ను జనజీవన స్రవంతి లోకి తీసుకురావడం కోసం ఆమె తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌరి లంకేష్ తమను బలహీనపరిచేలా ప్రవర్తిస్తున్నారని భావించిన నక్సలైట్లు చంపేశారని ప్రచారం సాగుతోంది.