జీడీపీకి వ్యవసాయం
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2013-14, జూలై-సెప్టెంబర్) 4.8 శాతంగా నమోదయ్యింది. వ్యవసాయం, తయారీ, నిర్మాణ, సేవల రంగాల మెరుగుదల ఇందుకు దోహదపడింది. మొదటి త్రైమాసికం వృద్ధి రేటు 4.4 శాతం. ఇంతకన్నా రెండవ క్వార్టర్ వృద్ధి రేటు మెరుగ్గా ఉండడం అటు విధాన నిర్ణేతలకు, ఇటు ఆర్థికవేత్తలకు కొంత ఊరటనిచ్చే అంశం. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వృద్ధి 5.2%. ప్రభుత్వం శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది.
విభాగాల వారీగా...
వ్యవసాయం: జీడీపీలో దాదాపు 13% వాటా కలిగిన ఈ రంగం 4.6% వృద్ధి రేటు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ రేటు 1.7 శాతం మాత్రమే. ఇక ఆర్థిక సంవత్సరం ఆరు నెలల కాలంలో ఈ రేటు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 2.3% నుంచి 3.6%కు పెరిగింది.
తయారీ: 0.1% వృద్ధి రేటు 1%కి పెరిగింది. అయితే ఆరు నెలల కాలంలో మాత్రం ఈ రంగంలో అసలు వృద్ధిలేదు. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా: ఈ మూడు రంగాల వృద్ధి రేటు మొత్తంగా సెప్టెంబర్ క్వార్టర్‌లో 3.2 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగింది. ఆరు నె లల కాలంలో ఈ రేటు 4.7 శాతం నుంచి 5.7 శాతానికి ఎగసింది.
నిర్మాణం: ఈ రంగంలో వృద్ధి రేటు 3.1 శాతం నుంచి 4.3 శాతానికి ఎగసింది. ఆరు నెలల కాలంలో వృద్ధి రేటు మాత్రం 5.1 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది.వాణిజ్యం, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్లు: ఈ రంగంలో కూడా వృద్ధి రేటు 6.8% నుంచి 4 శాతానికి తగ్గింది. ఆరు నెలల కాలంలో సైతం వృద్ధి 6.4% నుంచి 4%కి దిగింది.
సేవలు: జీడీపీలో మెజారిటీ వాటా కలిగిన ఈ రంగం (ఫైనాన్షింగ్, బీమా, రియల్టీసహా) సెప్టెంబర్ క్వార్టర్ వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 10 శాతానికి చేరింది. ఆరు నెలల్లో సైతం ఈ రేటు 8.8 శాతం నుంచి 9.5 శాతానికి చేరింది.
మైనింగ్, క్వారీ: అసలు ఈ రంగంలో వృద్ధి లేకపోగా -0.4 శాతం క్షీణత నమోదయ్యింది. 2012 సెప్టెంబర్ క్వార్టర్‌లో ఈ రంగం వృద్ధి రేటు 1.7 శాతం. ఇక ఆరు నెలల కాలంలో చూస్తే క్షీణత రేటు -1.6 శాతంగా ఉంది. 2012 ఇదే కాలంలో ఈ రంగం 1 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు: ఈ విభాగంలో సెప్టెంబర్ క్వార్టర్ వృద్ధి రేటు 8.4 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గింది. మొదటి ఆరు నెలల కాలంలో సైతం వృద్ధి రేటు 8.6 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింది.
వృద్ధి పుంజుకుంటుంది: మాయారామ్
మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి తిరిగి నెమ్మదిగా రికవరీ సాధిస్తుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో కొంత మెరుగైన ఫలితం రావడం సంతృప్తినిస్తోందని అన్నారు.
ద్రవ్యోల్బణంపై జాగ్రత్త అవసరం: పరిశ్రమలు
రెండవ క్వార్టర్‌లో వృద్ధి కొంత మెరుగుపడ్డం హర్షణీయ పరిణామమని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే భవిష్యత్తులో ద్రవ్యలభ్యత (లిక్విడిటీ), అధిక ద్రవ్యోల్బణం వృద్ధి మందగమనానికి దారితీసే అంశాలని అభిప్రాయపడ్డాయి. తాజా ఫలితాలు అంచనాలకన్నా అధికంగా, ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఫిక్కీ అధ్యక్షురాలు నైనా లాల్ కిద్వాయ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో రికవరీని ఇవి సూచిస్తున్నట్లు తెలిపారు. అయితే పరిశ్రమలకు ద్రవ్యలభ్యత ఇబ్బందులు రాకుండా చూడాల్సిన అవసరం ఉందని విశ్లేషించారు. వృద్ధి ధోరణి వేగంగా రికవరీ సాధించడానికి ఆహార ద్రవ్యోల్బణం కట్టడి జరగాలని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఇందుకు సరఫరాల వైపు సమస్యలను అధిగమించడం ముఖ్యమని సూచించారు. ప్రస్తుత ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టులను చేపట్టడం కూడా వృద్ధి వేగవంత గమనంలో అవసరమని విశ్లేషించారు. అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థ రికవరీ హర్షణీయమన్నారు.