త్వరలో భారత్‌కు ‘గీత’
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అనుకోకుండా సరిహద్దు దాటి 15 ఏళ్ల నుంచి పాకిస్తాన్‌లో నివసిస్తున్న మూగ, చెవిటి యువతి గీత.. త్వరలోనే తన కుటుంబాన్ని కలుసుకోబోతోంది. తన కుటుంబ సభ్యుల ఫొటోను గీత గుర్తించడంతో ఆమెను భారత్ రప్పించేందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయినట్లయింది.
‘‘త్వరలోనే గీత భారత్‌కు వస్తుంది. ఆమె కుటుంబాన్ని గుర్తించాం. అయితే డీఎన్‌ఏ పరీక్ష పూర్తయిన తర్వాత మాత్రమే ఆ కుటుంబానికి అప్పగిస్తాం’’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఆ తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. గీతకు మూడు సెట్ల ఫొటోలు పంపించామని, దానిలో ఒక సెట్‌లో ఉన్న వ్యక్తులను గీత తన కుటుంబ సభ్యులుగా గుర్తించిందని తెలిపారు. డీఎన్‌ఏ పరీక్ష తర్వాతే కుటుంబీకులను గుర్తిస్తామన్నారు. గీత తల్లిదండ్రులు బిహార్‌కు చెందిన వారిగా సమాచారం.
గీత జాతీయతను ఇప్పటికే గుర్తించామని, ఆమెను వెనక్కి తీసుకువస్తామని చెప్పారు. అయితే ఇది ఆమె తల్లిదండ్రులను గుర్తించామా, లేదా అనేదానికి సంబంధం లేకుండా జరుగుతుందన్నారు. గీత భారత పుత్రిక అని ఆయన అన్నారు. గీత గుర్తించిన వారు డీఎన్‌ఏ టెస్టులో ఆమె తల్లిదండ్రులే అని తెలిస్తే.. వారికే అప్పగిస్తామని వికాస్ చెప్పారు. లేదంటే గీత సంరక్షణార్థం ఢిల్లీలో, ఇండోర్‌లో ఒక్కో సంస్థను గుర్తించామని, ఆమెలాంటి వికలాంగులకు సేవ చేసే ఆ సంస్థల్లో ఒకదానికి అప్పగిస్తామన్నారు.
వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియలన్నీ పూర్తయ్యాయని చెప్పిన ఆయన.. గీతకు భారత్‌లో పెద్ద ఎత్తున స్వాగతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. గీతతో పాటు ఈదీ ఫౌండేషన్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులు భారత్‌కు వస్తారని ఆయన వెల్లడించారు. కాగా, గీతను వెనక్కి పంపుతున్న విషయాన్ని పాక్‌లో గీతను సంరక్షిస్తున్న ఈదీ ఫౌండేషన్ ప్రతినిధి అన్వర్ కజ్మి కూడా ధ్రువీకరించారు. ఆమెను ఈ నెల 26న స్వదేశానికి పంపే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి భారత్‌కు సమాచారమిచ్చామని పాక్ అధికారులు తెలిపారు.
ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్ పంపిన ఫొటోలోని తన తండ్రిని, సవతితల్లిని, తోబుట్టువులను గీత గుర్తించిందని తెలిసింది. గీతకు ఏడెనిమిదిఏళ్ల వయసున్నపుడు సంఝౌ తా ఎక్స్‌ప్రెస్‌లో సరిహద్దు దాటి పాక్‌లోని లాహోర్ స్టేషన్‌కు చేరింది. రైల్లో ఒంటరిగా ఉన్న ఆ పాపను పాక్ రేంజర్లు గుర్తించి ఈదీ ఫౌండేషన్‌కు అప్పగించారు. అక్కడి నుంచి గీత కరాచీకి చేరింది. సుష్మ ఆదేశాలపై పాక్‌లోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్ ఆగస్టులో గీతను కలిశారు. అప్పటి నుంచి గీత పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. గీతను తిప్పి పంపడానికి పాక్ సహకరిస్తున్నదని విదేశాంగ శాఖ తెలిపింది.