లక్షన్నర షెవ్రోలె కార్లు వెనక్కి
ముంబై: ఒకటికాదు రెండు కాదు ఏకంగా 1.5 లక్షల షెవ్రోలె కార్లను వెనక్కి తీసుకుంటున్నట్లు జనరల్ మోటార్స్ సంస్థ సోమవారం ప్రకటించింది. 2007 నుంచి 2014 సంవత్సరాల మధ్య అమ్ముడయిన షెవ్రోలె స్పార్క్, షెవ్రోలె బీట్, షెవ్రోలె ఎంజాయ్ మోడళ్ల బ్యాటరీల్లో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.
ఈ మేరకు కార్ల యజమానులకు ప్రత్యేకంగా లేఖలు రాసింది. ప్రస్తుతం ఆయా మోడళ్ల కార్లలో ఉన్న వైరింగ్తో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించామని, తగిన మార్పులను ఉచితంగా నిర్వహిస్తామని జనరల్ మోటార్స్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. వాహనదారులు సమీపంలోని షెవ్రోలె షో రూమ్ లకు వెళితే రెండు గంటల వ్యవధిలో మరమ్మతు చేసి పంపుతామన్నారు.