బాలుడిపై లైంగిక దాడి.. యువతి అరెస్టు
కేరళలో ఘోరం జరిగింది. 17 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కేరళలోని కొట్టాయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడితో ప్రేమాయణం నడిపించి, అతడి ఇంట్లోనే ఆమె ఉంటున్నట్లు తెలిసింది. తన కొడుకు మీద ఆమె లైంగిక దాడి చేసిందని బాలుడి తల్లి చేసిన ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. ఫిర్యాదు అందుకున్న రామాపురం పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి తలుపు కొట్టగా, వాళ్లిద్దరూ బయటకు వచ్చేందుకు నిరాకరించారు. దాంతో పోలీసులు తలుపులు పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్లి ఆమెను అరెస్టు చేశారు. బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డుకు పంపారు. ఎర్నాకులం ప్రాంతానికి చెందిన ఆ యువతిని కొట్టాయం జిల్లా పాల లోని జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధఙంచారు. ఫేస్‌బుక్ పరిచయంతో వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు తెలిసింది.
ఎవరైనా బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే వారిని పోక్సో చట్టం కింద అరెస్టు చేస్తారు. ఇంతవరకు ఎక్కువగా పురుషులే ఈ చట్టం కింద అరెస్టయ్యారు గానీ, మహిళలు అరెస్టయినట్లు ఎక్కడా పెద్దగా తెలియరాలేదు. అలాంటిది అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న కేరళ రాష్ట్రంలో ఇలాంటి కేసు నమోదు కావడం గమనార్హం.