ఎట్టకేలకు విముక్తి పొంది తల్లి ఒడికి చేరిన వైనం
బాగేపల్లి: ఇంటి నుంచి పారిపోయిన ఓ బాలిక వ్యభిచార కూపంలో ఇరుక్కొని ఆపై అక్కడి నుంచి తప్పించుకుని తల్లి ఒడికి చేరిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై ఫిర్యాదు అందుకున్న కర్ణాటకలోని బాగేపల్లి పోలీసులు చిన్నారితో వ్యభిచారం చేయిస్తున్న మహిళతోపాటు అమ్మాయిలను రవాణా చేస్తున్న తిరుపతికి చెందిన వ్యక్తిని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. 15 రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా, యనగొండకుచెందిన బాలిక (15) ఇంటి నుంచి పారిపోయి రైల్లో ఏపీలోని తిరుపతికి చేరుకుంది. తిరుపతికి చెందిన సునీల్ పని కల్పిస్తానని మాయమాటలు చెప్పి బాలికను బాగేపల్లిలోని లత అనే మహిళ వద్ద విడిచిపెట్టాడు.
ఆమె బాలికతో వ్యభిచారం చేయిస్తూ చిత్రహింసలకు గురిచేసేది. ఈ క్రమంలో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని చింతామణి వైపు వెళ్లే బస్సు ఎక్కింది. కండక్టర్ టికెట్ కోసం డబ్బు అడగ్గా తన వద్ద లేవంటూ అసలు విషయం వెల్లడించింది. దీంతో కండక్టర్ బాలికను తన ఇంటికి తీసుకెళ్లి, అనంతరం బాలిక తల్లికి సమాచారం ఇచ్చాడు. ఆమె బాగేపల్లికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లత ఇంటిపై దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, సునీల్ ఆ బాలికను తెచ్చినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు తిరుపతికి వెళ్లి సునీల్‌ను అరెస్ట్ చేశారు.
వ్యభిచార కూపంలో బాలిక
Published Wed, Jan 13 2016 4:11 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement