పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 99.8 శాతం మార్కులు తెచ్చుకుని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఓ అమ్మాయికి జూనియర్ కాలేజీలో సీటు రాని విచిత్ర సంఘటన నగరంలో చోటుచేసుకుంది.
ముంబై: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 99.8 శాతం మార్కులు తెచ్చుకుని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఓ అమ్మాయికి జూనియర్ కాలేజీలో సీటు రాని విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కళ్యాణ్ పాఠశాలలో పదోతరగతి చదివిన ఆమె పబ్లిక్ పరీక్షల్లో 99.8 శాతం మార్కులను సంపాదించింది. జూనియర్ కాలేజిల్లో చేరేందుకు నోటిఫికేషన్ వెలువడటంతో ఆన్ లైన్ ద్వారా నగరంలోని ప్రముఖ కాలేజీల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంది.
మంగళవారం కాలేజీల్లో సీట్లకు ఎంపికయిన అభ్యర్థుల్లో ఆమె పేరు లేకపోవడంతో ఒక్కసారిగా షాకైంది. తనకు వచ్చిన మార్కులకు కచ్చితంగా సీటు వస్తుందని భావించినట్లు చెప్పింది. ఈ నెల 10, 11, 16 తేదీల్లో మాత్రమే ఆన్ లైన్ ఆప్లికేషన్ లో కాలేజీల వరుసను మార్చినట్లు తెలిపింది. దీనిపై స్పందించిన అధికారులు ఆమె అప్లికేషన్ ను మార్చి ఉండకపోతే పాఠశాలకు చెందినవారే మార్పులు చేసి ఉంటారని అన్నారు. అప్లికేషన్ ను నింపేటపుడు పాఠశాల నుంచే సాయం తీసుకుంది కాబట్టి కచ్చితంగా మరలా వారే మార్పులు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. డిపార్ట్ మెంట్ కు సంబంధించి ఏదైనా పొరబాటు జరిగిందేమోనని విచారించామని అలాంటిదేమీ లేదని చెప్పారు. ఈ నెల20న విడుదల చేసిన జనరల్ మెరిట్ లిస్టులో ఆమె పేరు రాలేదు. దీంతో జులై 15న జరిగే మరో విడత అడ్మిషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.