గోదారిపై ‘గొలుసు కట్టలు’ | Godari on the 'cursive' | Sakshi
Sakshi News home page

గోదారిపై ‘గొలుసు కట్టలు’

Published Fri, Oct 9 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

గోదారిపై ‘గొలుసు కట్టలు’

గోదారిపై ‘గొలుసు కట్టలు’

రిటైర్డ్ ఇంజనీర్ టి.హనుమంతరావు ‘స్టెప్ లేడర్ టెక్నాలజీ’ రూపకల్పన  రాష్ట్రంలో 750 కిలోమీటర్ల పొడవున గోదావరి ప్రవాహం  15-20 కిలోమీటర్ల దూరం చొప్పున 30 బ్యారేజీలు  నది నిండా నీటి నిల్వ.. గ్రావిటీతోనే నీటి సరఫరా  18 లక్షల ఎకరాల సాగుకు అవకాశం  ఏడాది పొడవునా 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి  జల రవాణా, చేపల పెంపకం, పర్యాటకానికీ వీలు  ముంపు ఉండదు.. పూడిక చేరదు.. ఖర్చూ తక్కువ
 
హైదరాబాద్: భారీ డ్యామ్‌లు కడితే.. భా రీగా ముంపు ఉంటుంది, చాలా భూమి కావా లి, వేల కోట్లలో నిధులూ కావాలి. నిర్వాసితుల సమస్య సరేసరి. తక్కువ వ్యయంతోనే, ముంపు లేకుండానే.. మరెన్నో ప్రయోజనాలు అందించే ప్రత్యామ్నాయ విధానం ‘స్టెప్ లేడర్ టెక్నాలజీ’ని ప్రఖ్యాత ఇంజనీర్ టి.హనుమంతరావు రూపొందించారు. ఈ విధానంలో వరుస బ్యారేజీలు నిర్మిస్తే.. భారీ డ్యామ్‌ల వల్ల లభించే ప్రయోజనాలన్నీ ముంపు లేకుండానే పొందవచ్చు. తెలంగాణలో గోదావరి 750 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది. శ్రీరాంసాగర్ దిగువన ‘సోన్’ నుంచి భద్రాచలం వరకు గోదావరి మీద వరుసగా 30 బ్యా రేజీలను ‘స్టెప్‌లేడర్ టెక్నాలజీ’ ఆధారంగా నిర్మిస్తే.. మొత్తం నది అంతా పొడవైన రిజర్వాయర్‌గా మారిపోతుందని హనుమంతరావు చెబుతున్నారు. 300 టీఎంసీల లైవ్ స్టోరేజీకి అవకాశం ఉంటుందని... 450 టీఎంసీల నీటి వినియోగించుకుని 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చంటున్నారు. ఏడాది పొడవునా 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికీ వీలుంటుందని వివరిస్తున్నారు.

 ఇదీ పరిజ్ఞానం..
 700 కిలోమీటర్ల పొడవునా గోదావరి మీద 30 బ్యారేజీలు నిర్మించాలి. ఒక్కోదాని మధ్య 15-25 కి.మీ. దూరం ఉంటుంది. వీటిల్లో ఒక్కోదిగువ బ్యారేజీ నుంచి దానికన్నా ఎగువన ఉండే బ్యారేజీవరకు నీరు నిల్వ ఉంటుం ది. అంటే సుమారు 600 కి.మీ. పొడవునా నీరునిల్వ ఉంటుంది. ఒక్కో బ్యారేజీలో సగటున 10 టీఎంసీల చొప్పున 300 టీఎంసీల నీరుంటుంది. ఒక్కో బ్యారేజీ కింద గ్రావిటీ ద్వారానే 60 వేల ఎకరాలకు నీరివ్వచ్చు. అంటే 30 బ్యారేజీలు కలిపి 18 లక్షల ఎకరాలను సాగు చేయొచ్చు. ఏడాది పొడవునా నీటి నిల్వ ఉంటుంది కాబట్టి.. భూగర్భ జల మట్టం పెరుగుదలకు దోహదం చేస్తుంది.

 ముంపు ఉండదు
 ఈ విధానంలో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదు. నీటి నిల్వ గోదావరి వరద ప్రవాహస్థాయి దాటదు. నదీ ప్రవాహ ప్రాం తంలోనే 300 టీఎంసీల నుంచి 450 టీఎంసీ ల నీటినిల్వ ఉంటుంది. ఈస్థాయిలో నీటి విని యోగానికి రెండు భారీ రిజర్వాయర్లు అవసరం. అలాంటి భారీ డ్యామ్‌ల వల్ల ముంపు చాలా ఎక్కువగా ఉంటుంది.

 పూడిక సమస్య లేనట్లే..
 సాధారణంగా బ్యారేజీల నిర్మాణంలో రివర్ బెడ్ లెవల్ (నదీ గర్భం) మీద ‘బాడీవాల్’ నిర్మిస్తారు. ఫలితంగా పూడిక చేరుతుంది. కొన్నేళ్లకు బ్యారేజీ నిల్వ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. అదే ‘స్టెప్‌లేడర్ టెక్నాలజీ’లో బాడీ వాల్ నిర్మించాల్సిన అవసరం లేదు. రివ ర్ బెడ్ మీద ‘యాప్రాన్ (స్తంభాలు వంటివి)’లు నిర్మించి... వాటిని ఆధారంగా చేసుకుని రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తారు. ఈ రేడియల్ గేట్ల ఎత్తు నదీ ప్రవాహస్థాయిని బట్టి 12 నుంచి 18మీటర్లు ఉంటుంది. పూడిక పేరుకుం టే గేట్లు ఎత్తినప్పుడు కిందకు వెళ్లిపోతుంది.

 భారీగా విద్యుదుత్పత్తి..
 బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత గోదావరిలో నీటి ప్రవాహ స్థాయి 4-15 మీటర్లు, బ్యారేజీవద్ద 13-15మీటర్లు ఉంటుంది. విద్యుదుత్పత్తికి ఈ ఎత్తు సరిపోతుంది. ఒక్కో బ్యారే జీ వద్ద 100 నుంచి 200 మెగావాట్ల (సరాసరి 150మెగావాట్ల) విద్యుదుత్పత్తికి వీలుంటుం ది. మొత్తం 4,500 మెగావాట్ల విద్యుత్ ఏడాది పొడవునా ఉత్పత్తి చేయవచ్చు.

 ఖర్చు తక్కువే..
 ఒక్కో బ్యారేజీకి రూ.800 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. విద్యుదుత్పత్తి కూడా బ్యారేజీ డిజైన్‌లో భాగంగానే ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వం భారీగా ఖర్చుచేసే పరిస్థితి లేకుంటే.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో అయినా చేపట్టవచ్చు. ఒక్కో బ్యారేజీ వద్ద సరాసరిన 150 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది కాబట్టి.. ప్రైవేటు సంస్థలు ఒక్కో బ్యారేజీ మీద రూ.600 కోట్లదాకా పెట్టుబడికి ముందుకు వస్తాయి.

 జల రవాణాకు అనుకూలం
 జల రవాణాకూ అవకాశం కల్పించేలా బ్యారేజీ డిజైన్ ఉంటుంది. ఏడాది పొడవునా సుమారు 100 మిలియన్ టన్నుల సరుకుల రవాణా చేయవచ్చని అంచనా. రోడ్డు రవాణాతో పోలిస్తే జల రవాణా చౌక. కేంద్రం జల రవాణా అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో రవాణా రంగం నుంచీ పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశముంది. విద్యుత్‌తో పాటు జల రవాణా వస్తే పరిశ్రమలు వస్తాయి. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

 చేపలతో ఆదాయం
 ఏడాది పొడవునా 600 కిలోమీటర్లకుపైగా నీటి నిల్వ ఉంటుంది కాబట్టి చేపల ఉత్పత్తికి అనుకూలం. నదిలో నిరంతర ప్రవాహానికి బ్యారేజీ డిజైన్‌లో అవకాశం ఉంది. ఫలితంగా ‘ఫిష్ లేడర్’ ఏర్పడుతుంది. చేపల ఉత్పత్తి వల్ల ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంది.

 పర్యాటకానికి తోడ్పాటు
 జల రవాణా అభివృద్ధి చెందితే పర్యాటక రంగం కూడా వేగంగా వృద్ధి చెందుతుంది. దానివల్ల స్థానికులకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం రెండూ లభిస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement